
అత్యున్నత అధికారుల రాకపోకలే దీనికి కారణం
బిల్లుల చెల్లింపులు, ‘ప్రొటోకాల్’ తలనొప్పులు
ప్రతి నెలా భారీ మొత్తం భరిస్తున్న ఎస్‌హెచ్‌ఓలు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పబ్ కల్చర్ యువతలోనే కాదు.. ఐపీఎస్‌లు, అత్యున్నత అధికారుల్లోనూ పెరిగిపోయింది. వీకెండ్ వచి్చందంటే చాలు అనేక మంది యూనిఫాం తీసేసి పబ్స్‌లో వాలిపోతున్నారు. ఈ పరిణామం స్థానిక పోలీసులకు.. ప్రధానంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆ అధికారులకు అవసరమైన ప్రొటోకాల్ సేవలు చేయడంతో పాటు బిల్లులు విషయంలోనూ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కింది స్థాయి పోలీసు వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ఒకప్పుడు ఆదాయ మార్గాలుగా..
రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పని చేసే కొందరు అధికారులకు అనేక ‘ఆదాయ మార్గాలు’ ఉంటాయి. అలాంటి వాటిలో భూ వివాదాలతో పాటు వైన్‌షాపులు, బార్లు, పబ్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగానే ఇవి ఎక్కువగా ఉన్న పోలీసుస్టేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) పోస్టింగ్ పొందడానికి ఏ స్థాయి పైరవీ చేయడానికైనా సిద్ధమవుతుంటారు. ఇటీవల కాలంలో పబ్స్ ఉన్న పోలీసుస్టేషన్ల ఎస్‌హెచ్‌ఓల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్‌లోని కొన్ని ఠాణాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వీరికి నిద్రపట్టట్లేదు.
అధికారుల తాకిడే ప్రధాన కారణం..
ఒకప్పుడు ఎస్‌హెచ్‌ఓలకు తన బ్యాచ్‌మేట్స్, స్నేహితులు, పరిచయస్తుల నుంచే పబ్‌లకు సంబంధించిన సిఫార్సులు వచ్చేవి. తామో, తమ సంబం«దీకులో ఫలానా పబ్‌కు వెళ్తున్నారని, బిల్లులో ఎంతో కొంత తగ్గించేలా చూడాలని కోరేవారు. అలా వచ్చే వాళ్లు కూడా కొన్ని పబ్స్‌కే వెళ్లడానికి ఆసక్తి చూపించడం ఎస్‌హెచ్‌ఓలకు తలనొప్పిగా మారేది. కొన్నాళ్లుగా కొన్ని పబ్స్‌కు పోలీసు విభాగానికే చెందిన అత్యున్నత అధికారుల తాకిడి పెరిగింది. వీకెండ్ వచ్చిందంటే చాలా వీళ్లు తమ స్నేహితులు, సన్నిహితులతో వాలిపోతున్నారు. పబ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, కొందరి ఆర్కెస్ట్రాలు ఉన్నప్పుడు ఎంట్రీకి భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయాల్లోనూ తాము వస్తున్నామని, తొలి వరుసలో, ప్రత్యేకంగా సీట్లు కావాలంటూ ఆయా అధికారులు హుకుం జారీ చేస్తుండటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది.
తగ్గింపు కాదు పూర్తిగా ‘భరింపు’...
పబ్స్‌కు వస్తున్న పోలీసు ఉన్నతా«ధికారులకు ప్రొటోకాల్ సంబంధిత మర్యాదలూ స్థానిక పోలీసులకు తప్పట్లేదు. సాధారణంగా ఆయా అధికారులు ఆలస్యంగా వస్తుంటారు. దీంతో వారిని రిసీవ్ చేసుకోవడానికి, సపర్యలు చేయడానికి కనీసం ఓ హోంగార్డుని కేటాయించాల్సి వస్తోంది. ఇంత వరకు సర్దుకుపోతున్నా.. బిల్లుల వద్దకు వచ్చేసరికి కొందరు అధికారుల తీరు ఎస్‌హెచ్‌ఓలకు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆయా అధికారులకు ఆ పబ్‌లో లభించే అతి ఖరీదైనవే సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బిల్లుల్లో రాయితీ కోరితే కొంత వరకు ఇబ్బంది ఉండదు. అయితే కొందరు అధికారులు అసలు బిల్లులే చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో పబ్స్ యజమానుల నుంచి ఒత్తిడి పెరిగడంతో ఎస్‌హెచ్‌ఓలే వాటిని చెల్లించాల్సి వస్తోంది. కొన్ని పోలీసుస్టేషన్లకు చెందిన ఎస్‌హెచ్‌ఓలు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు తమ ‘కష్టార్జితం’ ఇలాంటి చెల్లింపుల కోసం వెచి్చంచాల్సి వస్తోంది.
సమయం మీరినా కొనసాగింపు...
ఇలాంటి అత్యున్నత అధికారులు పబ్స్‌కు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు, బిల్లుల చెల్లింపులతో పాటు సమయం అనేదీ ఎస్‌హెచ్‌ఓలకు ఇబ్బందికరంగా ఉంటోంది. తమ దైనందిన విధులు, ఇతర కార్యకలాపాలు ముగించుకునే ఆయా అధికారులు చాలా ఆలస్యంగా పబ్స్‌కు వస్తున్నారు. వాటి సమయం ముగిసినప్పటికీ తమ పారీ్టలు పూర్తికాలేదంటూ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓల ద్వారా పబ్ నిర్వాహకులు, యజమానులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రధాన ద్వారాలు మూసేసి, ఇతరుల్ని పంపించేసి కొన్ని పబ్స్ నడిపించాల్సి వస్తోంది. సాధారణ సమయంలో సమయం మీరినా, పరిమితికి మించి మ్యూజిక్ పెట్టినా కేసులు నమోదు చేస్తుంటామని, అలాంటిది ఇలాంటి ఉన్నతాధికారుల కోసం తాము ఉల్లంఘనలు చేయిస్తే మరోసారి కేసులు ఎలా నమోదు చేస్తామంటూ ఎస్‌హెచ్‌ఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది కింది స్థాయి అధికారుల్లో హాట్‌టాపిక్‌గా మారడంతో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.