ఇకపై సముద్ర లోతు జలాల్లోనూ చేపల వేటకు అవకాశం
గెజిట్ విడుదల చేసిన కేంద్ర మత్స్యశాఖ
సాక్షి, అమరావతి: చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులకు నిజంగా ఇది శుభవార్త. ఇక నుంచి సముద్ర లోతు జలాల్లోకీ నిశ్చంతగా వెళ్లి వేటాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే 200 నాటికల్ మైళ్లు (తీరం నుంచి 370 కిలోమీటర్ల) వరకు వెళ్లి వేటాడుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం గురువారం గెజిట్ విడుదల చేసింది.
ఇప్పటి వరకు లోతు జలాల్లోకి వేటకు వెళ్తే..
సముద్ర జలాల్లో తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల(22 కి.మీ.) వరకు రాష్ట్రాల పరిధిలో ఉండగా, ఆ తర్వాత 200 నాటికల్ మైళ్ల (370 కి.మీ.) వరకు ఉండే లోతు జలాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. ఈ పరిధిని దేశానికి సంబంధించిన ప్రత్యేక ఆర్ధిక మండలి (ఈఈజెడ్)గా పరిగణిస్తారు. ఆ తర్వాత అంతా అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు మత్స్యకారులు తమ రాష్ట్రాల పరిధిలో 12 నాటికల్ మైళ్ల లోపు మాత్రమే చేపలు వేట చేసుకునేందుకు అవకాశం ఉండేది.
కేంద్ర పరిధిలో ఉండే జలాల్లోకి అనుమతి ఉండేది కాదు. పొరపాటున లోతు జలాల్లోకి వెళ్తే ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు సమస్యలు, మరొక వైపు అక్రమంగా లోతు జలాల్లోకి వచ్చారంటూ కోస్టు గార్డు, నేవీ నమోదు చేసే కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలతో గంగపుత్రులు ఇబ్బందిపడేవారు.
సముద్ర వనరులను సద్వినియోగమే లక్ష్యంగా..
ప్రస్తుతం కాలుష్య ప్రభావంతో తీర ప్రాంతంలో మత్స్యసంపద అడుగంటిపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆశించిన స్థాయిలో వేట లభించడం లేదు. దీంతో గంగపుత్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మత్స్యకారులు వెళ్లిపోతున్నారు. వేటపైనే ఆధారపడి జీవించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఈఈజెడ్ పరిధిలోని సముద్ర వనరులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పంతో కేంద్రం లోతు జలాల్లో మత్స్యకారుల వేటకు అనుమతినిచి్చంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నియమ, నిబంధనలతో కూడిన గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయం వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్య కారులు, మత్స్యకార సహకార సంఘాలకు ఎంతో తోడ్పడనుంది.
స్వీయరక్షణ చర్యలు తప్పనిసరి
అయితే వేటకు వెళ్లే మత్స్యకారులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు తప్పనిసరిగా లైసెన్సు, యాక్సెస్ పాస్ కలిగి ఉండాలి. ప్రాణ రక్షణ పరికరాలు కలిగి ఉండటంతో పాటు జీపీఎస్ ట్రాన్స్‌పాండర్స్ అమర్చి ఉండాలి. లైసెన్సులను కనీసం మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు.
ఈఈజెడ్‌లో చేపల వేటకు సంబంధించిన రాష్ట్రాల మధ్య సరిహద్దు, నిర్వహణా వివాదాల పరిష్కారానికి లైసెన్సులు ఉపకరిస్తాయి. లోతు జలాల్లో వేటాడే మత్స్యకారులు, సహకార సంఘాలకు కేంద్రమే ఆరి్థక, సాంకేతిక మద్దతు అందిస్తుంది. లోతు జలాల్లో ఏదైనా సమస్యలకు గురైతే.. కోస్ట్ గార్డు, నేవీ నుంచి అవసరమైన తోడ్పాటు లభిస్తుంది. కాగా విధ్వంసకర మత్స్యవేట, చిన్న చేపల వేట, అక్రమ, నిషేధించిన, నియంత్రణలో లేని నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కేంద్రం తాజా ఆదేశాల్లోహెచ్చరించింది.
మత్స్యకారులకు వరం
లోతు జలాల్లో వేటాడే అవకాశం కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ మత్స్యకారులు, మత్స్యకార సహకార సంఘాలకు నిజంగా ఓ వరం. మత్స్యవనరుల సుస్థిరత, జీవ వైవిధ్య పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడనుంది. సాంకేతిక పద్ధతుల్లో మత్స్య వనరులను సేకరించడం వలన మత్స్య కారులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సముద్ర మత్స్య ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ప్రొసెసింగ్, ఎగుమతికి అవకాశాలు మెరుగుపడతాయి. –రామ్‌శంకర్‌నాయక్, కమిషనర్, రాష్ట్ర మత్స్యశాఖ
కేసుల బాధ ఉండదు
ఇప్పటివరకు సముద్రంలో 22 కిలోమీటర్లకు పైబడి లోపలికి వెళ్తే కోస్ట్ గార్డ్స్ ఆంక్షలు పెట్టేవారు. కేసులు నమోదు చేసేవారు. తీర ప్రాంతాల్లో మత్స్యసంపద సరిగా పడక డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పుడు 370 కిలోమీటర్లు లోపలికి వెళ్లే అవకాశం రావడం నిజంగా వరం. ఎక్కువ మత్స్య సంపద వేటాడే అవకాశం లభించింది. జీపీఎస్ ట్రాన్స్‌పాండర్స్ బిగించడం వల్ల ఎంత లోతు జలాల్లోకి వెళ్లాం, ఎక్కడ మత్స్యసంపద ఎక్కువగా ఉందో తెలుస్తుంది. – తిరుమాని బలరామ్మూర్తి, మత్స్యకారుడు, కృష్ణా జిల్లా


