అల్లిపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఈ ఏడాది తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలు, ఆలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి చంద్రబాబు ప్రభుత్వం కేవలం సచివాలయానికి ఒక కేంద్రాన్ని మాత్రమే కేటాయించడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే టీకా పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, 8.30 గంటల వరకు వ్యాక్సిన్ రాకపోవడంతో చలిలో చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు గంటల తరబడి వేచి చూస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది పనితీరు, ఏర్పాట్ల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
అనేక చోట్ల పీహెచ్‌సీ సిబ్బందికి కూర్చోవడానికి కనీసం కుర్చలు కూడా సమకూర్చకపో వడంతో వారు రోడ్డుపైనే నిలబడి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి వసతులు లేవు. అంతేకాకుండా, వారికి కనీసం టిఫిన్ లేదా భోజనం కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వినిపించాయి. వ్యాక్సిన్ బాటిల్స్ తెరిచే విషయంలో ప్రభుత్వం అవలంబించిన తీరు మరింత చర్చనీయాంశంగా మారింది.
ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ బాటిల్ మూత తీయడానికి చిన్నపాటి స్క్రూ డ్రైవర్ల ను అందజేసేవారు. అయితే ఈసారి దానికి భిన్నంగా మేకులను సరఫరా చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘సంపద సృష్టి’ పేరుతో ప్రభుత్వం ఇలాంటి పొదుపు చర్యలు చేపట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యం వహించడంపై తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పల్స్ పోలియో ః 76.70 శాతం
మహారాణిపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ముగిసింది. మొత్తం 76.70 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వార్డు, విలేజ్ సచివాలయాలతో పాటు బస్సు , రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,062 పోలింగ్ కేంద్రాలు, 94 మొబైల్ బృందాలను ఈ ప్రక్రియ కోసం వినియోగించారు. అర్బన్ ప్రాంతంలో 884, రూరల్ ప్రాంతంలో 178 కేంద్రాల ద్వారా సేవలు అందించారు. జిల్లాలో మొత్తం 2,09,652 మంది చిన్నారులు ఉండగా, ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 1,60,895 మంది (76.40శాతం) టీకా వేయించుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు వెల్లడించారు.


