ఏపీ: పొగాకు రైతుకు ప్రభుత్వ దన్ను

Andhra Pradesh Government Support Tobacco Farmers - Sakshi

 మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.128.65 కోట్ల పొగాకు కొనుగోళ్లు

మార్క్‌ఫెడ్‌ రాకతో వేలంలో వ్యాపారుల్లో పెరిగిన పోటీ

ఈ ఏడాది నష్టాల నుంచి ఒడ్డున పడిన పొగాకు రైతు

ఏటా బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల నష్టాలు

రాష్ట్రంలో పూర్తయిన పొగాకు వేలం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఏళ్ల తరబడి పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతూ.. ఏటా నష్టపోతున్న పొగాకు రైతులకు ఈ సంవత్సరం ఉపశమనం లభించింది. దర్జాగా పంటను అమ్ముకున్నారు. రెక్కలుముక్కలు చేసుకుని పండించినా.. వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న రైతుకు అండగా నిలవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులతో పోటీపడి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారులు కూడా ధరపెంచి కొనక తప్పలేదు. మార్క్‌ఫెడ్‌ దాదాపు రూ.128.65 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేలం గతనెల 29న పూర్తయింది.

లోగ్రేడ్‌ పొగాకు లక్ష్యంగా..
1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతిదారులు చెప్పిందే ధరగా నడిచేది. లోగ్రేడ్‌ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే.. రైతుకు అమ్ముకోక తప్పేదికాదు. రైతు కష్టాలు తెలిసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఆగస్టు ఒకటిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం 18 వేలం కేంద్రాల్లోనూ రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్‌ అధికారులు.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో రూ.85 వంతున లోగ్రేడ్‌ పొగాకు కొనుగోలును లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది. లోగ్రేడ్‌ బేళ్లన్నీ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తే చివరకు తమ వ్యాపారమూలాలు కదులుతాయని తాము కూడా పోటీపడి లోగ్రేడ్‌ బేళ్ల కొనుగోలు మొదలుపెట్టారు. దీంతో లోగ్రేడ్‌ పొగాకు ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు వ్యాపారులు, ఐటీసీ, పీఎస్‌ఎస్, జీపీఐ తదితర కంపెనీల ప్రతినిధులు పోటీపడి లోగ్రేడ్‌ పొగాకు కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్‌ రూ.128.65 కోట్ల విలువైన 12.93 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేసింది. దీన్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలోనే రూ.13.30 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది.

తగ్గిన నో బిడ్లు..
గతంలో వేలం కేంద్రాల్లో కొన్ని బేళ్లను వ్యాపారులు తిరస్కరించేవారు (నో బిడ్‌). గతంలో ప్రతి వేలం కేంద్రంలో 100 నుంచి 150 బేళ్ల వరకు నో బిడ్‌ పేరిట తిరస్కరించేవారు. అంటే మొత్తం వచ్చిన బేళ్లలో 35 నుంచి 40 శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో ఏటా బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర రైతుకు నష్టం వచ్చేది. ఈ ఏడాది నో బిడ్‌ల శాతం పదికన్నా తగ్గింది. దీంతో పొగాకు రైతులు ఈ ఏడాది నష్టాలు లేకుండా బయటపడ్డారు. (చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌)

రాష్ట్రంలో 18 పొగాకు వేలం కేంద్రాలు
రాష్ట్రంలో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు పండిస్తారు. ఈ పంట కొనుగోలుకు నాలుగు జిల్లాల్లో 18 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఇవి ప్రకాశం జిల్లాలో 10 (ఒంగోలు, టంగుటూరు, కందుకూరుల్లో రెండేసి, కొండపి, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి), పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు (జంగారెడ్డిగూడెంలో రెండు, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండు (డీసీ పల్లి, కలిగిరి), తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి (తొర్రేడు) ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top