విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పునఃసమీక్షిస్తేనే మేలు

Andhra Pradesh government reported to High Court on Visakha Steel Plant - Sakshi

ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి

ఇప్పటికే సీఎం జగన్‌ ప్రధానికి లేఖ రాశారు

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ సైతం తీర్మానించింది

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించేందుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశారని వివరించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం సైతం చేశారని తెలిపింది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరిందని వివరించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తన కౌంటర్‌లో ఎక్కడా పేర్కొనలేదంది.

ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు.

క్యాప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్లే నష్టాలు...
‘విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల 20వేల మందికి పైగా ప్రత్యక్షంగా, అనేక వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కర్మాగార ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 7.30 మిలియన్‌ టన్నులు. ఆధునికీకరణ, విస్తరణ నిమిత్తం కర్మాగారం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంది. 2014–15 నుంచి ఈ కర్మాగారం నష్టాలు ఎదుర్కొంటోంది. క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కర్మాగారం పునరుద్ధరణ నిమిత్తం ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ రాస్తూ పలు సూచనలు చేశారు. లాభాల బాట పట్టించేందుకు వీలుగా విశాఖ ఉక్కు కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయించాలని, ఆర్థిక పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు.

క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయిస్తే నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. నెలకు రూ.200 కోట్ల వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ, విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని కరికాల వలవన్‌ ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top