ప్రకృతి సాగులో రాష్ట్రం బెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగులో రాష్ట్రం బెస్ట్‌

Published Sun, Feb 26 2023 4:09 AM

Andhra Pradesh best in nature cultivation - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యమంలా సాగుతన్న ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం దక్కింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఏపీ­లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని ప్రశంసించింది. రాష్ట్రంలో ప్రకృతి సాగు ద్వారా వస్తున్న సామాజిక మా­ర్పులను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

అన్ని రాష్ట్రాలూ ఏపీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించింది. తొలుత 704 గ్రామా­ల్లో 40 వేల మందితో ప్రారంభమైన ప్రకృతి సాగు రాష్ట్ర ప్రభుత్వంలో ఓ ఉద్యమంలా రూపుదిద్దుకొంది. ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీ మాన్సూన్‌ సోయింగ్‌ పద్ధతిలో (తొలకరి వర్షాలు కంటే ముందే విత్తనం వేయడం) 3.70 లక్షల మంది రైతులు ఏపీలో ప్రకృతి సాగు చేస్తున్నారు. మిగతా రైతులు వీరితోపాటు ఖరీఫ్, రబీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా­రు. రైతులు కాకుండా ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 1.32 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు భాగస్వాములయ్యారు.

1.71 లక్షల మంది పేద, మధ్య తరగతుల ప్రజలు ఇళ్లలో కిచెన్‌ గార్డెన్లను పెంచుతున్నారు. 45 వే­ల మంది రైతులు ఏడాది పొడవునా ప్రకృతి వ్యవసాయ వి­ధా­నంలో బహుళ పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయా­న్ని పొందుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది.

ఘన జీ­వ, ద్రవ జీవామృతాలు, కషాయాలు, వివిధ రకాల ద్రావణా­లను రైతుల ముంగిట అందించేందుకు గ్రామైక్య సంఘాల సహకారంతో 3,909 బయో ఇన్‌పుట్‌ షాపులను ఏ­ర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో 28 లక్షల మందిని ప్రకృతి సాగులో భాగస్వాములను చేయాలన్నది లక్ష్యం.

రా­ష్ట్ర సహకారంతో పొరుగు రాష్ట్రాల్లో మరో 4 లక్షల మందిని ప్రకృతి సాగు వైపు మళ్లించేలా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఏపీ స్ఫూర్తితో ఈ ఏడాది జాతీయ స్థా­యిలో కోటి ఎకరాల్లో ప్రకృతి సాగుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 

ప్రకృతి సాగుతో వలసలకు అడ్డుకట్ట 
ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన మార్పులపై సామాజిక ఆర్థిక సర్వేలో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ప్రకృ­తి సాగు వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుల నికర ఆదాయం పెరుగుతున్నట్టు సర్వే పేర్కొంది. నగరాలకు వలసలు వెళ్లే యువతను తిరిగి గ్రామాలకు రప్పిస్తుందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిన రాష్ట్ర యువతలో కొందరు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు.

ఇదే కాకుండా పంట దిగుబడులను అంచనా వేసేందుకు ఇన్‌స్టిట్యూట్‌  ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (ఐడీఎస్‌) ఆధ్వర్యంలో చేపడుతున్న పంట కోత ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఏపీలో ని­రూí­³తమైందని సర్వే వెల్లడించింది. వ్యవసాయంలో ఖర్చు­తో పాటు రిస్కును తగ్గించి దిగుబడులను పెంచడం ద్వారా అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొంది.

వాతావరణ అనుకూల మార్పులకు బాటలు వేస్తోందని, సురక్షితమైన రసాయన రహిత ఆరోగ్యకర పౌష్టికాహారాన్ని సమాజానికి అందిస్తుందని, నేల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను, జీవ వైవిధ్యత పునరుత్పత్తి ద్వారా భావితరాలకు రక్షణగా నిలుస్తుందని పేర్కొంది. ఈ సాగు ప్ర­­­­­యోజనాలు ఏపీలో నిరూపితమయ్యాయని కూడా వెల్లడిం­చింది.

ప్రకృతి వ్యవసాయం అమలులో ఆంధ్రప్రదేశ్‌ ప్ర­భు­త్వ చర్యలను, మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని  నీతి ఆయోగ్‌ ప్రతినిధి బృందం అభినందించిన అంశాన్ని ఆర్థిక సర్వే నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలని ఆ సర్వేలో పేర్కొన్నారు. 

సామాజిక సర్వేలో ప్రస్తావించడం హర్షణీయం 
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వల్ల సమాజంలో వస్తున్న మార్పులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏపీసీఎన్‌ఎఫ్‌ (ఏపీ కమ్యూనిటీ నేచురల్‌ ఫార్మింగ్‌) చేస్తున్న కృషిని సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించడం హర్షణీయం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక సర్వే ఊతమిస్తోంది. 
– టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, రైతు సాధికార సంస్థ   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement