తప్పుగా మాట్లాడా.. క్షమించండి: డాక్టర్‌ సుధాకర్

Anasthesia Dr Sudhakar Attended Departmental Hearing - Sakshi

శాఖాపరమైన విచారణకు హాజరు

సాక్షి, నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన ఎనస్తీషియా వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనకు సంబంధించి వైద్య విధాన పరిషత్‌ రాష్ట్ర కమిషనర్‌ యు.రామకృష్ణరాజు ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వి.లక్ష్మణ్‌రావు మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణకు డాక్టర్‌ సుధాకర్‌ హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నీలవేణిదేవి, ప్రసూతి వైద్యనిపుణులు గౌతమి, అప్పట్లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన హెచ్‌వి.దొర, జనరల్‌ సర్జన్‌ సింహాద్రి, వైద్యులు, వైద్య సిబ్బందిని కోఆర్డినేటర్‌ విచారించారు.

అనంతరం లక్ష్మణ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. రూల్‌ నంబర్‌ 20 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని డాక్టర్‌ సుధాకర్‌పై వచ్చిన అభియోగంతోపాటు ఆయన ప్రవర్తనపై విచారించామన్నారు. విచారణ నివేదికను కమిషనర్‌కు నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.. అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశా’ అని చెప్పారు. ‘నాకు తెలియకనే అలా మాట్లాడానని విచారణ అధికారికి విన్నవించాను.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని మాట్లాడలేదు.. ఆరోగ్యం బాగులేని కారణంగా ఆ రోజు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు’ అని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు తెలిపారు. డాక్టర్‌ సుధాకర్‌ విశాఖపట్నంలో మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్‌ సృష్టించిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top