26న అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభం

Amul Project Starts On 26th November In AP - Sakshi

ఆర్బీకేల పరిధిలో 7,125 పాల సేకరణ కేంద్రాలు: మంత్రి అప్పలరాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటయ్యే 7,125 పాల సేకరణ కేంద్రాల (బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్ల)కు సంబంధించి అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈనెల 26న ప్రాజెక్టును సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మూడు దశల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 400 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డెయిరీలు 1.60 లక్షల లీటర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని,  200 లక్షల లీటర్లకు పైగా పాలు మిగిలిపోతున్నాయన్నారు. ప్రభుత్వమే పాడి రైతుల నుంచి పాలు కొనుగోలు చేయనుందని, ఇందుకోసం మహిళా పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఆర్బీకేల పరిధిలో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. తొలుత ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో వీటి ద్వారా పాల కొనుగోలు ప్రారంభమవుతుందన్నారు.  

గొడుగు, దుప్పటి, పాదరక్షలతో కిట్లు.. 
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి లక్షలమంది లబ్దిదారులు ముందుకు రావడం సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనమని మంత్రి చెప్పారు. పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్ల స్థాపనకు రూ.5,386 కోట్లు వెచ్చిస్తున్నామని, హరియాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణాతోపాటు రాష్ట్రంలోనూ కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలుకు కమిటీలో లబ్దిదారులతోపాటు సెర్ప్‌ అధికారి, బ్యాంకు ప్రతినిధి, పశు వైద్యాధికారి ఉంటారన్నారు.

లబ్దిదారుల ఇష్టప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. ట్యాగింగ్‌ కలిగిన పాడి పశువులు, గొర్రెలు, మేకలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, మూడు రోజులపాటు పాల ఉత్పత్తిని పరీక్షించిన తరవాతే కొనుగోలు చేస్తామన్నారు. ఈ నెల 21నుంచి నాలుగు రోజులపాటు బ్యాంకులతో యూనిట్ల అనుసంధాన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు గొడుగు, దుప్పటి, పాదరక్షలతో కూడిన కిట్లు అందజేయాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో డిసెంబర్‌ 31 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు లక్ష పశువులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top