‘లోక్‌భవన్‌ ముట్టడి’పై పోలీసు ప్రతాపం | All roads leading to Lok Bhavan are closed with iron fences and barricades | Sakshi
Sakshi News home page

‘లోక్‌భవన్‌ ముట్టడి’పై పోలీసు ప్రతాపం

Oct 11 2026 5:26 AM | Updated on Oct 11 2026 5:26 AM

All roads leading to Lok Bhavan are closed with iron fences and barricades

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును అరెస్టు చేస్తున్న పోలీసులు , మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

విజయవాడలో శాంతియుత నిరసనపై ఉక్కుపాదం 

పోలీసు దిగ్బంధంలో సీపీఎం, సీపీఐ కార్యాలయాలు  

లోక్‌భవన్‌కు వెళ్లే అన్ని దారులు ఇనుప కంచె, బారికేడ్లతో మూసివేత 

ఎక్కడికక్కడ నాయకులు, శ్రేణుల హౌస్‌ అరెస్టులు

సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరుతూ కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ పార్టీలు శనివారం విజయవాడలో నిర్వహించిన లోక్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ శుక్రవారం అర్థరాత్రి నుంచే విజయవాడ, తాడేపల్లి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని వామపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. లోక్‌భవన్‌కు వెళ్లే అన్ని దారులను బారికేడ్లు, ఇనుప కంచెలతో మూసివేశారు. 

లెనిన్‌ సెంటర్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యాలయాలను పోలీసులు దిగ్బంధించారు. వందలాది మంది పోలీసులు మోహరించి పెద్ద సంఖ్యలో వాహనాలు తీసుకొచ్చి అరెస్టులు చేశారు. దీంతో.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన ‘ఛలో లోక్‌భవన్‌’ కార్యక్రమంతో విజయవాడ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పోలీసుల దాడిలో విద్యార్థి సంఘాల కార్యకర్తలు ముగ్గురు గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. వీరిని పోలీసులు కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. గాయపడ్డ వారిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షురాలు జ్యోతి çస్పృహ తప్పిపడిపోగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వంశీ, ఏలూరు జిల్లా కార్యకర్త మాధవ్‌ను పోలీసులు గుండెపై తన్నటం, తోపులాటలో గాయపడ్డారు.  

వేర్వేరు పోలీసుస్టేషన్లకు నేతల తరలింపు.. 
ఇక విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఆందోళనకు దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, వి. ఉమామహేశ్వరరావు, వి. రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు పి. ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ, ఎంసీపీఐయు నాయకులు ఖాదర్‌బాషా, ఎస్‌యుసీఐసీ నాయకులు కె. సుధీర్, కాంగ్రెస్‌ ఏపీ ఇన్‌చార్జి వి.మోహన్,  ఆ పార్టీ నేతలు గిడుగు రుద్ర­రాజులతోపాటు పలువురు నాయకులు, కార్య­కర్తలను పోలీసులు అరెస్టుచేశారు. 

వీరందరినీ ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట టూటౌన్, సింగ్‌నగర్, నున్న, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు తరలించారు. కార్యక్రమానికి మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభానాద్రీశ్వరరావు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా గన్నవరం  మండలం కేసరపల్లి శివారు ఎస్‌ఎల్‌ విల్లాస్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన చలో లోక్‌భవన్‌ నేపథ్యంలో ఆమెను నిర్బంధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement