విశాఖ ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న ప్రయాణికులు
తిరుపతిలో సిబ్బందిపై విమాన ప్రయాణికుల ఫైర్
గన్నవరం, విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల పడిగాపులు
స్వదేశానికి వచ్చిన వారు వీసాలు రద్దవుతాయని గగ్గోలు
రేణిగుంట/గన్నవరం/గోపాలపట్నం/కోరుకొండ: విమాన సర్వీసుల్లో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రçßæం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి(రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ప్రతిరోజు 12 ఇండిగో విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో విమానాలు రద్దయ్యాయని ఇండిగో సిబ్బంది తాపీగా చెబుతుండడంతో ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక శనివారం రాత్రి 7.50కు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్ రద్దయింది. ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్ ధరలను అమాంతం పెంచడంతో ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు.
శ్రీవారి భక్తుల అగచాట్లు..
తిరుపతికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి నిత్యం వస్తుంటారు. రావడానికి, తిరిగి వెళ్లడానికి వీరు ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, శ్రీవారి దర్శనానంతరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వీరికి విమానం రద్దయిందని చెప్పడంతో ప్రత్యామ్నాయంలేక వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అత్యవసరంగా వేరే నగరాలకు వెళ్లాల్సిన వారి అవస్థలూ చెప్పనలవి కావు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయానికి చేరుకున్నాక సర్వీసు రద్దని చెప్పడంపై వారు మండిపడుతున్నారు. పైగా.. వేరే విమాన సర్వీసుల ధరలను ఇదే అదనుగా పెంచేస్తుండడంతో ప్రయాణికుల పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా తయారైంది.
వీసాలు రద్దవుతాయని గగ్గోలు..
మూడు రోజులుగా ఇండిగో విమానాలను రద్దవుతుండడంతో ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పలు దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. విమానాలు రద్దుకావడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో తమ వీసా గడువు ముగుస్తుందని.. భవిష్యత్తు ఏమవుతుందో అంటూ వారు కంగారుపడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియడంలేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం విశాఖలో తొమ్మిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో కూడా ఇదే పరిస్థితి. ముంబై నుంచి రావాల్సిన విమానం శనివారం రద్దయింది. ఢిల్లీ నుంచి శుక్రవారం రావల్సిన సర్వీసు శనివారం చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమాన సర్వీసులన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి.
ఇండిగో సర్వీసులు ఆలస్యం..
పైలెట్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు శనివారం కూడా గన్నవరం విమానాశ్రయానికి అలస్యంగా నడిచాయి. ఢిల్లీ–విజయవాడ మధ్య నడిచే సర్వీసును వరుసగా రెండోరోజూ రద్దుచేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం సర్వీసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరుకు సుమారు రూ.18 వేలు, న్యూఢిల్లీకి రూ.35 వేలు నుంచి రూ.42 వేలు వరకు టికెట్ ధర పెరిగిందని చెబుతున్నారు.
కనీస సమాచారం ఇవ్వలేదు..
ముంబై వెళ్లేందుకు 15 రోజులు ముందుగా ఇండిగో సర్వీసులో టికెట్ బుక్‌చేసుకున్నా. ఇవాళ ముంబై వెళ్లేందుకు రేణుగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక విమానం రద్దయిందని ఇండిగో సిబ్బంది చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వేరే ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఇప్పుడు మీ డబ్బులు తిరిగిస్తామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. – వెంకటేష్, తిరుపతి


