
విద్యుత్ వాహనాలతో వాయు కాలుష్య నియంత్రణ
ఈవీలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లోకి హైడ్రోజన్ ఇంధనం
ధర, నిర్వహణ ఖర్చులు ఎక్కువైనా భవిష్యత్‌లో తగ్గే అవకాశం
సాక్షి, అమరావతి: వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం వల్ల ఉద్యోగాలు, ముఖ్యమైన సేవలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
కానీ.. దానికి మించి ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లు కూడా పెరిగిపోతాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్‌లో వాహనాలకు హైడ్రోజన్ ఇంధనం తోడు కానుంది. అది కాలుష్యాన్ని నియంత్రించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహనరంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈవీలకు పెరిగిన డిమాండ్
మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతం అని లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది. ఇందులో ముంబైలో ఏటా 5,100 మరణాలు, కోల్‌కతాలో 4,678 మరణాలు, చెన్నైలో 2,870 మరణాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించే ప్రజా రవాణా వ్యవస్థలపై నగరాలు దృష్టి సారించాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్ పెరిగింది. 2023లో మొత్తం వాహన అమ్మకాలలో ఈవీల వాటా దాదాపు 5 శాతంగా ఉంది. మొత్తం కార్ల అమ్మకాలలో కేవలం 10 శాతం వృద్ధితో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల రిజి్రస్టేషన్లు ఏటా 70 శాతం పెరిగి 80 వేల యూనిట్లకు చేరుకున్నాయి.
అయితే, అత్యంత వేగవంతమైన వృద్ధి త్రీ వీలర్ విభాగంలో ఉంది. ప్రపంచ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అమ్మకాలలో దాదాపు 60 శాతం వాటా భారత్‌కు ఉంది. వాస్తవానికి 2023లో మనదేశం చైనాను అధిగమించి 5.80 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలతో అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా నిలిచింది. 8.80 లక్షల వాహనాలను విక్రయించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌గా మనదేశం అవతరించింది.
దూసుకొస్తున్న హైడ్రోజన్
బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ.. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్‌సీఈవీ) ఈవీలకు ప్రత్యామ్నాయంగా దూసుకొస్తున్నాయి. ఇవి అధిక శక్తి సాంద్రత కారణంగా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. బ్యాటరీతో నడిచే వాహనాల కంటే తేలికగా ఉంటాయి.
ముఖ్యంగా సుదూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలుగుతాయి. అయితే, ఎఫ్‌సీఈవీలు ప్రస్తుతం చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 93 వేల వాహనాలే ఉన్నాయి. దీనికి కారణం అధిక ధర, నిర్వహణ ఖర్చులుగా చెప్పుకోవచ్చు. ఇంధన సెల్ బస్సులు, ట్రక్కులు వాటి బ్యాటరీ, ఎలక్ట్రిక్ కౌంటర్ పార్ట్‌ల కంటే 20–30 శాతం ఎక్కువ హైడ్రోజన్ వాహనాలకు ఖర్చవుతాయి. అయినప్పటికీ, సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
దిగిరానున్న ఖర్చులు
డీజిల్ బస్సులకు కిలోమీటర్‌కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 మాత్రమే ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ కిలోమీటర్‌కి రూ.71.73 ఖర్చవుతుంది.
అదే గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక వనరుల నుండి తీసుకుంటే కిలోమీటర్‌కు రూ.77.69 ఖర్చవుతుంది. హైడ్రోజన్ వాహనాల ప్రారంభ ధర రానున్న ఐదేళ్లలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ధరతో సమానంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వాటి నిర్వహణ ఖర్చులు 2030 తర్వాత కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.
భారీ లక్ష్యానికి తోడ్పాటు
కాలుష్యం లేని భారత్ కోసం ‘నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్’కి మన దేశం రూపకల్పన చేసింది. నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీని, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచటం, వాహన కాలుష్యాన్ని తగ్గించటం వంటి లక్ష్యాలతో ఈ ప్రణాళికను తీసుకొచ్చారు. దేశంలో ఎక్కువ మంది ఫ్యూయెల్ బేస్డ్ వాహనాలే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది.
భవిష్యత్‌లో మన దేశంలో విద్యుత్ వాహనాలను మాత్రమే నడపాలని కేంద్రం భావిస్తోంది. పొల్యూషన్ ఫ్రీ ఇండియాను, ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితులను చూడాలన్నదే తన ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. హైడ్రోజన్ వాహనాల వినియోగం ఇందుకు తోడ్పాటు అందించనుంది.