ఏపీ స్ఫూర్తితో కేరళలో వ్యవసాయ విస్తరణ | Agricultural expansion in Kerala inspired by Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ స్ఫూర్తితో కేరళలో వ్యవసాయ విస్తరణ

Oct 17 2022 6:30 AM | Updated on Oct 17 2022 7:32 AM

Agricultural expansion in Kerala inspired by Andhra Pradesh - Sakshi

కంకిపాడులోని అగ్రిల్యాబ్‌ను సందర్శించి వివరాలు తెలుసుకుంటున్న కేరళ వ్యవసాయ సంచాలకుడు సుభాష్‌

సాక్షి, అమరావతి/కంకిపాడు (పెనమలూరు): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేరళలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్‌ వెల్లడించారు. ఇక్కడ నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారని అందువల్లే పండ్లు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతిని సాధిస్తోందని కొనియాడారు.

సుభాష్‌ సారథ్యంలో కేరళ ప్రైస్‌బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ రాజశేఖరన్‌ నాయర్, వ్యవసాయ శాఖ అడిషనల్‌ సెక్రటరీ సబీర్‌ హుస్సేన్, అడిషనల్‌ డైరెక్టర్‌ సునీల్‌తో కూడిన కేరళ వ్యవసాయ ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా కంకిపాడులోని వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను సందర్శించింది. ల్యాబ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు ఆక్వాఫీడ్‌ టెస్టింగ్‌ విధానాలను స్వయంగా పరిశీలించారు.

గతంలో రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో 11 ల్యాబ్స్‌ మాత్రమే ఉండేవని.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పాదకాలను రైతులకు అందించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం నియోజకవర్గస్థాయిలో 167, జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లతో పాటు రీజినల్‌ స్థాయిలో నాలుగు కోడింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేస్తోందని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు కేరళ బృందానికి వివరించారు.

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచడమే కాక.. రైతులకు ఉచితంగా సేవలందిస్తున్నామని చెప్పారు. అనంతరం.. టెస్టింగ్‌ పరికరాలు, టెస్టింగ్‌ విధానాన్ని కేరళ బృందం పరిశీలించి ప్రశంసించింది. దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటుచేసిన దాఖలాల్లేవని సుభాష్‌ పేర్కొన్నారు. 

ఏపీలో ఎఫ్‌పీఓలు బాగా పనిచేస్తున్నాయి
అనంతరం.. అరటి ప్రాసెసింగ్, ఎగుమతుల్లో జాతీయస్థాయి అవార్డుతో పాటు వైఎస్సార్‌ లైఫ్‌టైం అఛీవ్‌మెంట్‌ అవార్డు సాధించిన తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులోని శ్రీ విఘ్నేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘం (అరటి ఎఫ్‌పీఓ) కార్యకలాపాలను పరిశీలించారు. సంఘంలోని సభ్యులతో సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

సంఘ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందించిందని ఉద్యాన శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ బాలాజీ నాయక్‌ కేరళ బృందానికి వివరించారు. రాష్ట్రంలో ఎఫ్‌పీఓల వ్యవస్థ చాలా బలంగా ఉందని, ఏటా వందల కోట్ల టర్నోవర్‌ జరుగుతోందన్నారు. 100కు పైగా ఎఫ్‌పీఓల పరిధిలో 37వేల మంది  రైతులున్నారని చెప్పారు. ఎఫ్‌పీఒగా ఏర్పడిన తర్వాత సాగు ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం 30 శాతం మేర పెరిగిందని ఎఫ్‌పీఓ డైరెక్టర్‌ కొల్లి చంద్రమోహన్‌రెడ్డి వివరించారు.

నేరుగా ట్రేడర్స్‌కు విక్రయించడం ద్వారా రైతులకు గరిష్ట ధర లభించేలా కృషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ సుభాష్‌ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కూడా ఎఫ్‌పీఓలున్నాయని.. కానీ, ఇంత బలంగాలేవని చెప్పారు. ఆర్‌బీకే వ్యవస్థ ఏర్పాటు, పనివిధానం గురించి ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement