
ఏపీ సరిహద్దు, తెలంగాణలోని మేళ్లచెరువు మండలంలో గుట్టుగా తయారీ
ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఏపీలోని పలు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా
తెలంగాణ, ఏపీ టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా స్పిరిట్ స్వాదీనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. టీడీపీ నేతల ధన దాహానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అత్యంత హానికరమైన స్పిరిట్‌తో ప్రముఖ బ్రాండ్ల పేరిట కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఏపీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.
ఇక్కడ తయారైన మద్యంతో పాటు తయారీకి అవసరమయ్యే స్పిరిట్ ఏపీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంది. సోమవారం సాయంత్రం తెలంగాణ, ఏపీ టాస్‌్కఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ నకిలీ మద్యం గుట్టు రట్టయింది. గ్రామానికి చెందిన శివశంకర్, సూర్య ప్రకాశ్‌కు చెందిన ఓ రేకుల షెడ్ గోదాంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి 832 లీటర్ల స్పిరిట్‌తో పాటు, సీసాల్లో నింపి ఉన్న రూ.15 లక్షల విలువజేసే నకిలీ మద్యాన్ని, మరో 38 కార్టన్ల విస్కీ బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు.
ఇక్కడి నుంచి బస్తాల రూపంలో ప్యాక్ చేసి, కృష్ణానదిలో పుట్టీల ద్వారా పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి రాష్ట్రమంతటా సరఫరా అవుతోంది. ఎనీ్టఆర్ జిల్లా పక్కనే ఆనుకొని ఉండటంతో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతాలోని మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులకు నేరుగా సరఫరా చేసి టీడీపీ నేతలు భారీగా దండుకుంటున్నారు.
ఇటీవల మైలవరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో సైతం కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు మందు బాబులు అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలోనూ ఇదే పరిస్థితి. పాలకొల్లులో జరిగిన ఘటనకు సైతం ఈ నకిలీ మద్యం తయారీ గ్యాంగ్‌తో లింక్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ ముఠాలో పల్నాడు ప్రాంతం దుర్గికి చెందిన శ్రీరాం మహేష్ కూడా ఉన్నాడు. ఈ దందాలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
తయారీ వస్తువుల సరఫరా ఇలా..
మెగ్‌డోల్ విస్కీ ధర ఏపీలో క్వార్టర్ బాటిల్ రూ.200గా ఉంది. హైదరాబాద్‌కు చెందిన రూతుల శ్రీనివాస్ బాటిల్ తయారీకి అవసరమైన అన్ని వస్తువులను సరఫరా చేస్తున్నాడు. ఒకేసారి 25వేల బాటిల్స్ తయారీకి అవసరమైన సరుకు, రూ.20 లక్షలు తీసుకొని ఏపీలోని పలు ప్రాంతాలకు చేరవేస్తున్నాడు.
బాటిల్ తయారీకి కేవలం రూ.80 ఖర్చు అవుతుంది. మిగిలిన రూ.120 మద్యం సిండికేట్ పచ్చ గద్దలు మేస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే రూ.కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఈ స్పిరిట్‌ను హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ ఫార్మాకి చెందిన యజమాని శివచరణ్ సింగ్ ద్వారా శ్రీనివాస్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కల్తీ మద్యానికి కేంద్ర బిందువుగా మారిన ఏపీ..
అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తూ మద్యం ప్రియుల ప్రాణాల మీదకు తెస్తున్న రాకెట్‌కు రాష్ట్రం కేంద్ర బిందువుగా మారింది. ఎక్సైజ్ శాఖ అధికారులు జూన్ 23 నుంచి జులై 22 వరకు నిర్వహించిన దాడుల్లో భారీగా కల్తీ మద్యం దందా బయటపడింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, బాపట్ల, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో 2,200 లీటర్ల అక్రమ స్పిరిట్, బ్రాండెడ్ మద్యం లేబుళ్లతో అక్రమంగా ప్యాకింగ్ చేసిన కల్తీ మద్యం వేలాది బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
22 మందిని అరెస్టు చేశారు. ఈ కల్తీ మద్యాన్ని ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కల్తీ మద్యం దందాకు హైదాబాద్‌లోని కృష్ణా ఫార్మా కంపెనీ అక్రమంగా స్పిరిట్ సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆ కంపెనీ యజమాని తన నేరాన్ని అంగీకరించినట్టు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది.