ఏపీకి 19.02 లక్షల టన్నుల ఎరువులు

Above 19 lakh tonnes of fertilizers for Andhra Pradesh - Sakshi

ఖరీఫ్‌–2022 సన్నద్ధతపై జాతీయ స్థాయి సమీక్షలో కేంద్రం 

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచన 

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు లక్ష్యం 57.32 లక్షల హెక్టార్లు

సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్‌–2022 సీజన్‌లో ఏపీకి రూ.19.02 లక్షల టన్నుల ఎరువులను కేటాయించనున్నట్టు కేంద్ర, వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజ వెల్లడించారు. ఖరీఫ్‌ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లతో సోమవారం ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్‌ పంటల విస్తీర్ణం, పంటలు, భూసార పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్లుగా ఎరువుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. 

వరి సాగు లక్ష్యం 16.33 లక్షల హెక్టార్లు  
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 57.32 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా వరి 16.33 లక్షల హెక్టార్లు, వేరు శనగ 7.30 లక్షల హెక్టార్లు, పత్తి 6.24 లక్షల హెక్టార్లు, కంది 2.70 లక్షల హెక్టార్లు, మినుము లక్ష హెక్టార్లు, పెసర 14 వేల హెక్టార్లు, జొన్న 17 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.16 లక్షల హెక్టార్లు, నువ్వులు 13 వేల హెక్టార్లు, రాగి 26 వేల హెక్టార్లు, మిరప 1.80 లక్షల హెక్టార్లు, కూరగాయలు 2.65 లక్షల హెక్టార్లు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 57.32 లక్షల హెక్టార్లుగా అంచనా వేశామన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో 79.8 శాతం నేలల్లో నత్రజని, 15.80 శాతం నేలల్లో భాస్వరం, 14.71 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్‌ లభ్యత తక్కువగా ఉన్న విషయాన్ని భూసార పరీక్షల్లో గుర్తించినట్టు కమిషనర్‌ తెలిపారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ కోసం రాష్ట్రానికి యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ 2.25 లక్షల టన్నులు, ఎంవోపీ 1.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ 6.41 లక్షల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 95 వేల టన్నులు.. మొత్తం 19.02 లక్షల టన్నులు అవసరమని కమిషనర్‌ కోరగా.. ఆ మేరకు ఏపీకి ఎరువులను కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజలు ప్రకటించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top