ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేష్‌ 

710 patients have been treated since November under YSR Arogyashri - Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద నవంబర్‌ నుంచి 710 మంది రోగులకు చికిత్స  

మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముఖేశ్‌ త్రిపాఠి

సాక్షి, అమరావతి:  మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేషుగ్గా ఉందని ఆ సంస్థ డైరెక్టర్, సీఈవో డాక్టర్‌ ముఖేశ్‌ త్రిపాఠి చెప్పారు. ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని వివరించినట్టు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.

ఎయిమ్స్‌కు శాశ్వత నీటిసరఫరా పనులను ఈ ఏడాది జూలైలోగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్టు తెలిపారు. రహదారి సౌకర్యానికి సంబంధించి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయని, ఆర్‌అండ్‌బీ శాఖ రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఎంవోయూ చేసుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద గత నవంబర్‌ నుంచి ఇప్పటివరకు 710 మంది రోగులు ఉచితంగా వైద్యసేవలు అందుకున్నారన్నారు.

2019 మార్చి 12వ తేదీన రోగుల సంరక్షణ సేవలు ప్రారంభించామని, ఈ నాలుగేళ్లలో 9,67,192 మంది ఓపీ, 7,477 మంది ఐపీ సేవలు అందుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 2,590 మేజర్, 29,486 మైనర్‌ సర్జరీలు నిర్వహించామన్నారు. 37 స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకోసం వైద్యుల నియామకం చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రోజకు సగటున 2,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నట్టు చెప్పారు. ఇన్‌పెషంట్స్‌ కోసం 555 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం, పరీక్షలకు రూ.వంద ఖర్చవుతుంటే.. తమవద్ద రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ఆస్పత్రిలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమలవుతోందని ఈ క్రమంలో ప్రజలు ఆన్‌లైన్‌లో ఓపీడీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, నర్సింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో పారామెడికల్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రూ.1,680 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్‌ ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు.

చికిత్స పొందిన పలువురు రోగులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తమకు వైద్యసేవల్లో ఎయిమ్స్‌ చూపుతున్న చొరవను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రిటైర్డ్‌ ఉద్యోగులు ప్రశంసించారు. సంఘం తరఫున డైరెక్టర్, డీన్‌లకు జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల ఎయిమ్స్‌ ప్రస్థానంపై రూపొందించిన బ్రోచర్‌ను డైరెక్టర్, డీన్‌లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్‌లు డాక్టర్‌ జాయ్‌ ఎ ఘోషల్, డాక్టర్‌ శ్రీమంతకుమార్‌ దాస్, డాక్టర్‌ దీప్తి వేపకొమ్మ, డాక్టర్‌ వినీత్‌ థామస్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకరన్, మీడియా సెల్‌ ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top