పీజీ ప్రవేశ పరీక్షకు వేళాయె

42,082 applications for AP PGCET - Sakshi

ఏపీ పీజీ సెట్‌కు 42,082 దరఖాస్తులు 

దరఖాస్తుదారుల్లో అమ్మాయిలే అధికం 

22 నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు 

సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ నజీర్‌అహ్మద్‌ 

కర్నూలు కల్చరల్‌: ఏపీ పీజీ సెట్‌–2021కు మొత్తం 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌–2021)ను నిర్వహిస్తున్నారు. ఒకే పరీక్షతో విద్యార్థులు తమకు ఇష్టమైన వర్సిటీలో తమకు నచ్చిన కోర్సులో చేరేందుకు, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 145 కోర్సులకు 43,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 42,082 దరఖాస్తుల్లో అమ్మాయిలు అత్యధికంగా 23,684 మంది దరఖాస్తు చేసుకోగా, అబ్బాయిలు 18,561 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ ముగ్గురు ఉన్నారు. ఓసీలు 7,769, బీసీ–ఏ 5,557, బీసీ–బీ 5,969, బీసీ–సీ 406, బీసీ–డీ 9,580, బీసీ–ఈ 1,511, ఎస్సీ 9,363, ఎస్టీ 2,093, పీహెచ్‌ 342 మంది ఉన్నారు.

విశాఖపట్నంలో 5,895, తూర్పు గోదావరిలో 4,677, కర్నూలులో 4,019, కృష్ణాలో 3,431, అనంతపురంలో 3,420, విజయనగరంలో 3,355, పశ్చిమ గోదావరిలో 3,158, చిత్తూరులో 2,816, గుంటూరులో 2,666, వైఎస్సార్‌ కడపలో 2,321, శ్రీకాకుళంలో 2,304, నెల్లూరులో 1,837, ప్రకాశంలో 1,647, హైదరాబాద్‌లో 540 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కేంద్రాలను ఎంచుకున్నారు.

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ పీజీ సెట్‌–2021 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై.నజీర్‌అహ్మద్‌ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ముందస్తుగా ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కోవిడ్‌–19 నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top