
218 పులుల దాడిలో అత్యధికంగా మహారాష్ట్రలో మరణించినవారు
624 ఏనుగుల దాడిలో అత్యధికంగా ఒడిశాలో మృతిచెందినవారు
25 ఏపీలో ఏనుగుల దాడిలో మరణించినవారు
పులుల దాడుల్లో 378 మంది మృతి
ఏనుగుల దాడులతో 2,869 మంది మృత్యువాత
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల దాడుల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్లలో పులులు, ఏనుగుల దాడిలో 3,247 మంది మృత్యువాతపడ్డారు. ఆహారం, తాగునీరు కోసం అడవుల నుంచి పంట పొలాలు, మైదాన ప్రాంతాల్లోకి పులులు, ఏనుగులు రావడం రోజురోజుకూ పెరుగుతోంది. వాటికి, మానవులకు మధ్య సంఘర్షణలు కూడా ఎక్కువయ్యాయి. అందువల్ల పులులు, ఏనుగుల దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత ఐదేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 378 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 218 మంది మృతిచెందినట్లు వివరించింది. గత ఐదేళ్లలో ఏనుగుల దాడుల్లో 2,869 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా ఒడిశాలో 624 మంది, ఆ తర్వాత జార్ఖండ్‌లో 474 మంది, పశ్చిమ బెంగాల్‌లో 436 మంది మృతిచెందారని వివరించింది.
వన్యప్రాణులసంరక్షణ చర్యలకు కేంద్రం సాయం
దేశంలో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆవాసాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’, ‘ప్రాజెక్ట్ టైగర్’, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.
అడవి జంతువులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ముళ్ల తీగతో కంచె, సోలర్ ఫెన్సింగ్, బయోఫెన్సింగ్, సరిహద్దు గోడలు వంటివాటి ఏర్పాటుకు కూడా మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. అడవి జంతువుల దాడుల్లో మృతిచెందిన వారికి లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి ఎక్స్‌గ్రేíÙయాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు వివరించింది.