పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు

3068281 Eligible Selection Transparently For Distribution Of Housing Lands - Sakshi

ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పారదర్శకంగా 30,68,281 మంది అర్హుల ఎంపిక

66,518 ఎకరాల భూమి సిద్ధం

కోర్టు స్టేలు ఉన్నచోట మినహాయించి మిగిలిన అన్నిచోట్లా పట్టాల పంపిణీ

లేఔట్లలో సౌకర్యాలపై అధికారుల దృష్టి

డిసెంబర్‌ 25న పట్టాల పంపిణీ నాటికి పక్కాగా సౌకర్యాలు

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్‌ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వనీయకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పార్టీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించడంతో కోర్టు స్టేలు ఇచ్చినచోట మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతి చోటా లేఔట్లను పరిశీలించి.. ప్లాట్లవారీగా నంబర్‌ రాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చింది. ఏయే లేఔట్లపై కోర్టు స్టేలు ఉన్నాయో.. ఇందుకు కారణాలేమిటో తెలుసుకుని వాస్తవాలు వివరించడం ద్వారా ‘స్టే’ వెకేట్‌ చేయించడంపై కలెక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో సమీక్షించారు. జిల్లాల వారీగా కోర్టు వివాదాలు లేకుండా పంపిణీకి సిద్ధం చేస్తున్న లేఔట్లు, లబ్ధిదారుల డేటా పంపాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. 

15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు వచ్చే నెల 25న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు
కోర్టు వివాదాలు ఉన్న స్థలాలను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ స్థలాలు చూసి వీలైనంత ఎక్కువమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,42,976 మంది అర్హులను ఎంపిక చేయగా 4,316 మందికి ఎంపిక చేసిన లేఔట్ల విషయంలో కోర్టు స్టేలు ఉన్నాయి. దీంతో 4,316 మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి మొత్తం 1,42,976 మందికి లబ్ధి చేకూర్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,88,384 మందికి స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి వివాదం లేదు. కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నవారిలో మరో నాలుగైదువేల మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో 71,237 మందిని ఎంపిక చేయగా కోర్టు స్టేల వల్ల 1,711 మందికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు స్టేల వల్ల ఈ నెల 25న పంపిణీ చేయని వారికి స్టేలు వెకేట్‌ చేయించి లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూసి తర్వాత పంపిణీ చేయనున్నారు. 

పారదర్శకంగా అర్హుల ఎంపిక
ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడా కోర్టు స్టేలు లేవు. అత్యంత పారదర్శకంగా 1,10,634 మంది అర్హులను ఎంపిక చేశాం. డిసెంబర్‌ 25న వీరందరికీ పట్టాలను అందజేస్తాం.  
– సి.హరికిరణ్, కలెక్టర్, వైఎస్సార్‌ జిల్లా 

దేశంలోనే ఎక్కడా లేదు
దేశ చరిత్రలోనే ఎక్కడా ఒకేసారి ఇంతమందికి నివాస స్థల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి దీన్ని యజ్ఞంలా భావించడం వల్లే పేదల కల సాకారమవుతోంది. కోర్టు స్టేలు ఉన్నవి మినహాయించి జిల్లాలో సుమారు 1.15 లక్షల మందికి టిడ్కో ఇళ్లు, పొజిషన్‌ సర్టిఫికెట్లు, నివాస స్థలాలకు డి.ఫారం పట్టాలు ఇవ్వనున్నాం. 
– వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్, విశాఖపట్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top