పింఛన్లు:65,98,138 | Sakshi
Sakshi News home page

పింఛన్లు:65,98,138

Published Wed, Sep 13 2023 4:47 AM

28 lakhs of new pensions given in the last four years - Sakshi

సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్‌ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు.

కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్‌ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్‌ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... 
ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం.  

ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. 
సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.   

నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న  ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలి­పా­రు. జగన్‌ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభు­త్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తు­న్నారు.

గత ప్రభు­త్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయ­గా ఇప్పుడు సీఎం జగన్‌ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు.

Advertisement
 
Advertisement