‘టైమ్స్‌’ ర్యాంకులకు పోటాపోటీ | 2540 universities submit data for Impact Rankings | Sakshi
Sakshi News home page

‘టైమ్స్‌’ ర్యాంకులకు పోటాపోటీ

Jan 31 2025 5:24 AM | Updated on Jan 31 2025 5:24 AM

2540 universities submit data for Impact Rankings

ప్రపంచవ్యాప్తంగా 2,540 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలు

అత్యధికంగా భారత్‌ నుంచి 148 సంస్థల దరఖాస్తు

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలే కొలమానంగా వర్సిటీలకు ర్యాంకులు  

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ర్యాంకింగ్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నుంచి పోటీ పెరుగుతోంది. గతేడాది కంటే అత్యధికంగా ‘ఇంపాక్ట్‌’ ర్యాంకులకు ప్రతిపాదనలు వెల్లువెత్తగా మన దేశం నుంచి ఎక్కువ విద్యా సంస్థలు దరఖాస్తు చేయడం విశేషం. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా విద్యాసంస్థలు ర్యాంకులు పొందగా ఈ ఏడాది దరఖాస్తుల్లో 18 శాతం పెరుగుదల నమోదైంది. ఈసారి 130 దేశాల నుంచి సుమారు 2,540 విశ్వవిద్యాలయాలు డేటాను సమర్పించాయి. 
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వర్సిటీల పనితీరును పరిశీలించి ర్యాంకులు అందిస్తున్నారు.

సగానికిపైగా ఆసియా నుంచే..
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌ ర్యాంకుల కోసం పోటీ పడుతున్న విద్యాసంస్థలు ఆసి­యా­లోనే అధికంగా ఉన్నాయి. ప్రతిపాదనల్లో సగానికిపైగా ఆసియా నుంచే వచ్చాయి. భారత్‌ 148 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో అగ్రస్థానంలో నిలి­చింది. పాకిస్తాన్‌ 127 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో రెండో స్థానంలో ఉండగా 121 విద్యా సంస్థలతో ఫిలిప్పీన్స్‌ మూడో స్థానంలో ఉంది. అంగోలా, అజర్‌బైజాన్, చైనా, ఇండోనేషియా, కెన్యా, లిబియా నుంచి కూడా ఎక్కువ ప్రతిపాదనలు అందాయి. బెనిన్, బోట్సా్వనా, బుర్కినా ఫాసో, ఎల్‌ సాల్వడార్, ఎస్టోనియా, మాల్దీవులు, నమీ­బియా, పాపువా న్యూ గినియా, సెనెగల్, జింబాబ్వే మొదటి సారిగా ప్రతిపాదనలతో సిద్ధమయ్యాయి.

నాణ్యమైన విద్య..
సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ‘నాణ్యమైన విద్య’ విభాగంలో అత్యధిక ప్రతిపాదనలు వచ్చి­నట్లు ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ప్రకటించింది. ఇందులో ఏకంగా 1,991 విశ్వవిద్యాలయాలు డేటా­ను అందించాయి. ‘మంచి ఆరోగ్యం–శ్రేయస్సు’ విభాగంలో 1,801 సంస్థలు పోటీ పడగా ‘లింగ సమానత్వం’లో 1,566 విద్యా సంస్థలున్నాయి. ఈ 3 లక్ష్యాలకు అనుగుణంగా గత నాలుగేళ్లుగా అత్యధికంగా ప్రతిపాదనలు వస్తుండటం గమనార్హం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జూన్‌ 16–19వ తేదీలలో జరిగే గ్లోబల్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ కాంగ్రెస్‌లో ఇంపాక్ట్‌ ర్యాంకింగ్స్‌ ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement