అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల విధులంటేనే ఉపాధ్యాయులు హడలిపోతున్నారు. ప్రజాస్వామ్య పండుగలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన వారే.. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక విధులకు దూరంగా ఉండాలని భావిస్తున్న పరిస్థితి నెలకొంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు మెజార్టీ వచ్చిన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించేందుకు ప్రయత్నించిన పోలింగ్ సిబ్బందిపై అధికార టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెజార్టీ వందల ఓట్లతో ఉన్నా డిక్లరేషన్ ఇవ్వకూడదంటూ ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
బెదిరింపుల ఆడియోతో కలకలం
కంబదూరు మండలం తిమ్మాపురం ఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడితో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో వినిపిస్తున్న మాటతీరుపై ఉపాధ్యాయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో పలు మండలాలతో పాటు అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లోనూ కొన్ని బూత్‌లలో పోలింగ్ సిబ్బందిపై ఒత్తిళ్లు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల కమిషన్ భరోసా ఏదీ?
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎన్నికల కమిషన్ నియంత్రణలో పనిచేస్తారు. అలాంటప్పుడు విధుల నిర్వహణలో రాజకీయ జోక్యాలు, బెదిరింపులు ఎదురైతే వారిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల యంత్రాంగంపైనే ఉంటుంది. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం కల్పించాలి. విధులకు ఆటంకం కలిగించే వారిపై ఫిర్యాదులు స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన భద్రత కల్పించడంతో పాటు ఆర్‌ఓలు, ఇతర ఎన్నికల సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన భరోసా ఇవ్వాలి. రెండో విడత ఎన్నికలకు ముందే జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు స్పందించి ఉపాధ్యాయుల్లో విశ్వాసం నింపాలని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
అధికార పార్టీ ఒత్తిళ్లతో బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు
రెండో విడత ఎన్నికల విధులకు వెళ్లాలంటేనే హడల్
అధికారులు భరోసా ఇవ్వాలని కోరుతున్న టీచర్లు


