పయ్యావుల అండతోనే అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

పయ్యావుల అండతోనే అక్రమాలు

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

అనంతపురం: మంత్రి పయ్యావుల కేశవ్‌ అండతోనే పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ మంత్రి కేశవ్‌ ఆర్డీఓలు, రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ‘స్థానిక’ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే టీడీపీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. మరుట్లలో సీఐ రాజు ఆదేశాలతో టీడీపీ నేతలు పోలింగ్‌బూత్‌లోకి చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడితే ప్రజలు తిరగబడ్డారని, ఈ ఘటన ద్వారా మంత్రి నిజస్వరూపం ఏమిటో బట్టబయలైందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్‌ పత్రాల్లో వరుస సంఖ్యలను మార్చి, సీఐ మహానంది స్వయంగా జోక్యం చేసుకుని ఎంపీడీఓ, పోలింగ్‌ అధికారుల ద్వారా తమ పార్టీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరింపజేశారని ఆరోపించారు. వేల్పుమడుగులో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న అభ్యర్థిని పోలీసులే అడ్డగించి కిడ్నాప్‌ చేశారని అన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఏకై క లక్ష్యంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షనిజాన్ని ప్రేరేపిస్తున్న ఘనత కూడా ఆయనదేనని విమర్శించారు.

అరాచకాలను పట్టించుకోని పోలీసులు

స్థానిక ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ అధికారుల పనితీరుపై సీనియర్‌ న్యాయవాది రాచమల్లు హరినాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ ఇన్ని అరాచకాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, పోలీసులు మంత్రి పయ్యావుల కేశవ్‌ బూట్లు నాకుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉరవకొండ సీఐ మహానంది, కూడేరు సీఐ రాజు మంత్రి ఇంటి వాచ్‌మెన్లుగా మారి పనిచేయడం విచారకరమన్నారు. గుంతకల్లు ఆర్డీఓ మంత్రి ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓటమి చెందుతామనే భయం నెలకొందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు నెరిమెట్ల యోగానందరెడ్డి, లీగల్‌ సెల్‌ నాయకుడు బాబ్జీ, నాయకుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ, విత్‌డ్రాలపై ఆగ్రహం

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement