మందకొడిగా రబీ | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా రబీ

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ మాదిరిగానే రబీ కూడా మందకొడిగా ‘సాగు’తోంది. ప్రధానపంట పప్పుశనగ సాగుకు ఈనెల 15తో అదను ముగుస్తున్నా ఇంకా 50 శాతం మేర నల్లరేగళ్లు బీళ్లుగానే దర్శనమిస్తున్నట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ రబీలో 1.08 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా ప్రస్తుతానికి 40 వేల హెక్టార్లకు చేరుకుంది. అందులో ప్రధానపంట పప్పుశనగ 61 వేల హెక్టార్లు అంచనా వేయగా ప్రస్తుతానికి 30 వేల హెక్టార్లకు పరిమితమైంది. సాగు గడువు సమీపిస్తున్నా ఇంకా సగం విస్తీర్ణం ఖాళీగానే ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఆలస్యమైనా పప్పుశనగ సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. మిగతా పంటల విషయానికి వస్తే వేయి హెక్టార్లలో వేరుశనగ, 4 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 2 వేల హెక్టార్లలో కుసుమ సాగు చేశారు. డిసెంబర్‌ 15 వరకు వేరుశనగ సాగుకు గడువు ఉన్నట్లు చెబుతున్నారు. 7 వేల హెక్టార్లలో వరి సాగులోకి రావచ్చని, మొత్తంగా చూస్తే రబీ పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

కొనసాగుతోన్న వర్షాభావం

ఖరీఫ్‌ మాదిరిగానే రబీలో కూడా వరుణుడు మొహం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురవాల్సిన అక్టోబర్‌లో 100.7 మి.మీగానూ ఏకంగా 69 శాతం తక్కువగా 31.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో పంటల సాగు మందకొడిగా తయారైంది. నవంబర్‌లో 28.7 మి.మీ గానూ 4.9 మి.మీ వర్షం కురిసింది. సాధారణం కన్నా రబీలో కూడా 68 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. సీజన్‌ మొదట్లోనే 20 మండలాల్లో 21 రోజులు వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్‌) నమోదయ్యాయి. కేవలం రెండు మూడు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. అందులోనూ గుమ్మఘట్ట, తాడిపత్రి, బ్రహ్మసముద్రం, రాయదుర్గం తదితర 15 మండలాల్లో సాధారణం కన్నా ఏకంగా 45 నుంచి 75 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా బలహీనంగా తయారు కావడం, చివరకు అర్నాబ్‌, మురసు లాంటి తీవ్ర తుపాన్లు కూడా ప్రభావం చూపకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ దెబ్బతినడంతో ‘అనంత’ రైతు కోలుకోలేనంత కరువులో ఇరుక్కుపోయాడు.

ప్రధాన పంట పప్పుశనగ

30 వేల హెక్టార్లలో సాగు

15తో ముగుస్తున్న అదను .. ఇంకా 50 శాతం బీళ్లు

ఖరీఫ్‌ మాదిరిగానే రబీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement