బాలల్లో న్యుమోనియాపై నిర్లక్ష్యం వీడండి | - | Sakshi
Sakshi News home page

బాలల్లో న్యుమోనియాపై నిర్లక్ష్యం వీడండి

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

అనంతపురం సిటీ: ఐదేళ్ల చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయరాదని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ‘సాంస’ కార్యక్రమ బ్యానర్‌ను ఆయన ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాఉతూ ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో సుమారు 17.2 శాతం న్యుమోనియాతో సంభవిస్తున్నవేనన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా చిన్నారుల మరణాలను గణనీయంగా తగ్గించొచ్చన్నారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బందితో సమన్వయ సమావేశాలు నిర్వహించి, తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆశా ఫెసిలిటేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం సిటీ: 108 అంబులెన్స్‌, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు భావ్య హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్లు, ఫ్లీట్‌ మెకానిక్స్‌, డిస్ట్రిక్ట్‌ ఫ్లీట్‌ మేనేజర్లు, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డ్రైవర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. ఫ్లీట్‌ మెకానిక్‌ పోస్టులకు ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ అర్హత, డిస్ట్రిక్ట్‌ ఫ్లీట్‌ మేనేజర్‌ పోస్టులకు బీటెక్‌ మెకానికల్‌ అర్హత ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నాలజీ, డీఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ తదితర విద్యార్హతలు కలిగిన వారు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ నెల 15న శ్రీ పోసాని సురేష్‌ చెదరి హాస్పిటల్‌, ఎన్‌హెచ్‌–65, వెంకటేశ్వర నగర్‌, మహేంద్ర నగర్‌, గొల్లపూడి, విజయవాడలో జరిగే వాక్‌–ఇన్‌–ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. వివరాలకు సెల్‌: 89776 10335తోపాటు recruitment@bhspl.in ఈమెయిల్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

మహిళపై దాడి

యల్లనూరు (పుట్లూరు): పుట్లూరు మండలం సూరేపల్లికి చెందిన మద్దినేని రమణిపై బాలరంగయ్య, భాగ్యలక్ష్మి దాడి చేసి గాయపరిచారు. బాధితురాలు గురువారం ఎస్‌ఐ సురేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. సూరేపల్లి గ్రామంలో రమణికి బాలరంగయ్య, భాగ్యలక్ష్మికి భూ సమస్య, ఇంటి వద్ద స్థలం వివాదం ఉంది. దీన్ని మనసులో పెట్టుకొని గురువారం దాడి చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో

ప్రజాస్వామ్యం ఖూనీ

అనంతపురం అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి రాష్ట్రంలో ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌ విమర్శించారు. అక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్‌ పత్రాలు చించేయడం, బెదిరించడం, నామినేషన్లు తిరస్కరింపజేయడం.. ఇలాంటి చర్యలతో కూటమి ప్రభుత్వానికి, ఆపార్టీల నాయకులకు జాతీయ స్థాయిలో పరువు పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ కూడా కొమ్ముకాసిందని దుమ్మెత్తిపోశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే బౌన్సర్లను పెట్టుకుని ఎన్నికల్లో దాదాగిరి చేశారని ఆరోపించారు. తాడిపత్రిలోనూ దౌర్జన్యాలు జరిగాయన్నారు. కేంద్ర, అంతర్జాతీయ నిఘా సంస్థలూ కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను గమనించాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన శింగనమల, తిరుపతి, కదిరి, అనంతపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచారన్నారు. ఇదే తరహాలో రాష్ట్రమంతా జరిగి ఉంటే ఏ ఒక్క చోటా కూటమి అభ్యర్థులు గెలిచేవారు కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్‌, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement