ప్రజలకు తాగునీటిని అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతోంది. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కార్మికులకు జీతాలతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సొమ్ము చెల్లింపుల్లో తాత్సారం చేస్త | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు తాగునీటిని అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతోంది. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కార్మికులకు జీతాలతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సొమ్ము చెల్లింపుల్లో తాత్సారం చేస్త

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

అనంతపురం న్యూ టౌన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల పరిధిలోని సుమారు 900 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. పథకానికి నిధులు కేటాయించకుండా.. నిర్వహణ బాధ్యతను జిల్లా పరిషత్‌కు బదలాయించింది. అయితే జిల్లా పరిషత్‌కు అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో పథకం పరిధిలో పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం ప్రతిసారీ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయాల్లో ప్రజలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంటోంది. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

వేతనాలందక అప్పులపాలు

శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు 2025లో సమ్మె చేపట్టిన కాలానికి సంబంధించిన ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలల వేతనాలను ఇప్పటికీ చెల్లించలేదు. 2026 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు మరో ఏడు నెలల వేతనాలు బకాయి ఉన్నాయి. మొత్తం పది నెలల జీతాలు అందక సుమారు 600 మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దె, కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కార్మికులు వేతనాలు అడిగితే కాంట్రాక్టర్లు తమకు సంబంధం లేదంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా పరిషత్తు నిధులు లేవని చెబుతోంది.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అక్రమాలు

ట్రంక్‌ లైన్‌ పనుల్లో సుమారు 110 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికునికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాల్సి ఉండగా, పీఎఫ్‌ విషయంలో కార్మికుని వాటాగా రూ.1,380 జమ కావాల్సిన చోట రూ.510 మాత్రమే జమ చేసినట్లు కార్మికులు వాపోతున్నారు. కాంట్రాక్టర్‌ వాటాలోనూ రూ.510 మాత్రమే జమ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా 15 నెలలుగా పీఎఫ్‌ చెల్లింపుల్లో బకాయిలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈఎస్‌ఐ కోసం కార్మికుల వేతనాల నుంచి నెలకు రూ.100 మినహాయిస్తున్నప్పటికీ, వారి ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా అప్‌డేట్‌ కావడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. పీఎఫ్‌, ఈఎస్‌ఐ రికార్డులను అధికారులు తనిఖీ చేసి, బకాయిలు పూర్తిగా జమ చేయించాల్సిన అవసరం ఉంది.

ఇష్టారాజ్యంగా వేతన కోతలు

ఫేజ్‌–4లో సుమారు 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2023 వరకు కాంట్రాక్టర్‌ శివారెడ్డి ఒక్కో కార్మికునికి రూ.18 వేల వేతనం చెల్లించేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్‌గా వచ్చిన శివశంకర్‌రెడ్డి వేతనంలో రూ.1,000 కోత విధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడపా వెంకటరావుకు కాంట్రాక్టు అప్పగించారు. ప్రస్తుతం రూ.18 వేల వేతనంలోంచి రూ.8 వేల వరకు కోత విధిస్తున్నారని, రూ.100 బాండ్‌ పేపర్లపై తమతో సంతకాలు చేయించుకొని వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా కార్మికుల వేతనాలు తగ్గడం, బకాయిలు పెరగడం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపుల్లో అక్రమాలపై కలెక్టర్‌, కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందనా లేదు.

18 ఫిల్టర్‌ బెడ్లు పనిచేయడం లేదు

నిర్వహణపై నిర్లక్ష్యం

నిర్వీర్యమవుతున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం

కార్మిక సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కార్‌

10 నెలల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మికులు

శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఫిల్టర్‌ బెడ్లను మార్చకపోవడంతో 18 ఫిల్టర్‌ బెడ్లు పనిచేయడం లేదని కార్మికులు చెబుతున్నారు. నీటి శుద్ధికి అవసరమైన ఆలం, బ్లీచింగ్‌ పౌడర్‌ తదితర రసాయనాలను తగిన మోతాదులో వినియోగించడం లేదని, కొన్ని ప్రాంతాలకు సరైన శుద్ధి లేకుండానే నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. అధికారులు వెంటనే నీటి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల ఫలితాలను ప్రజలకు తెలియజేయాలి. పనిచేయని ఫిల్టర్‌ బెడ్లను మార్చి అవసరమైన రసాయనాలు, మోటార్లు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement