సాక్షి ఫొటోగ్రాఫర్/ అనంతపురం అగ్రికల్చర్ : డిమాండ్‌కు అనుగుణంగా అదనపు కౌంటర్ ఏర్పాటు చేయకపోవడం, తగినంత స్టాకు తెప్పించకపోవడంతో అనంతపురంలోని రైతుబజార్‌లో బియ్యం కోసం జనం కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్ సహకారంతో పౌరసరఫరాల శాఖ తక్కువ ధరకే బియ్యం అందిస్తామని ప్రకటించింది. కిలో రూ.50తో 26 కిలోల ప్యాకెట్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. ప్రారంభంలో బియ్యం నాణ్యతగా ఉండటంతో జనం వీటిపై మొగ్గు చూపారు. తర్వాత కొద్ది రోజులకే బియ్యం నాణ్యత తగ్గిపోయిందన్న విమర్శలూ వచ్చాయి. అయినా బయట మార్కెట్లో బియ్యం కొనలేని జనం.. ప్రభుత్వం ఇస్తున్న బియ్యంపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఏడు గంటలకే రైతు బజార్‌కు చేరుకున్నారు. కొంతసేపటికే స్టాక్ అయిపోవడంతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొంతసేపటి తర్వాత స్టాక్ వచ్చింది. క్యూలో నిల్చున్న వారు.. ఈసారి బియ్యం పొందడానికి తోసుకోవడం.. మధ్యలోకి దూరిన వారితో గొడవకు దిగడంతో ఆ ప్రాంతం రచ్చరచ్చగా మారింది. ఒకే కౌంటర్, సరుకు తక్కువ కారణంగా జనం ఇబ్బంది పడుతున్నా పౌరసరఫరాల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
క్యూలో మధ్యలోకి రావడంతో ఆగ్రహిస్తున్న మహిళ, రైతు బజార్‌లో బియ్యం కోసం క్యూలో నిల్చున్న జనం


