● మాతాశిశు మరణంతో తీరని విషాదం
గుమ్మఘట్ట: మాతాశిశు మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రసవించిన కొద్దిసేపటికే శిశువు మరణించగా.. దీన్ని తట్టుకోలేకపోయిన తల్లి గంటల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన లక్ష్మక్క, బొమ్మయ్య దంపతుల కుమారుడు రాజన్నకు కర్ణాటక రాష్ట్రం గుడేకోట సమీపంలోని అల్లుకుందిచెరువు గ్రామానికి చెందిన మనోదిత(22)తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. మనోదితకు మొదటి కాన్పులో కుమారుడు జన్మించాడు. రెండోసారి గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం అల్లుకుందిచెరువు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున పండంటి మగబిడ్డను ప్రసవించింది. అయితే కొంతసేపటికే శిశువు చనిపోయాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మనోదిత తీవ్ర అస్వస్థతకు గురైంది. మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే ప్రాణం విడిచింది. ఈ ఘటనతో పుట్టినింట.. మెట్టినింట విషాదఛాయలు అలుముకున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.


