● వేలంపాట దక్కించుకున్నా డబ్బు చెల్లించని పాటదారుడు
ఉరవకొండ రూరల్/ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి ఆదాయ వనరులైన కొబ్బరి చిప్పలు, తలనీలాలు లాంటి వేలం పాటల్లో అధికారులు నిబంధనలకు పాతరేశారన్న విమర్శలున్నాయి. స్వామి హుండీ కానుకల లెక్కింపు తేదీని ఖరారు చేసి ఈఓ పత్రికా ప్రకటన జారీ చేసిన తర్వాత అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఆలయంలో తలనీలాలు, కొబ్బరి చిప్పల వేలంతో పాటు మరికొన్ని వేలాలను నిర్వహిస్తున్నామని తేదీలు ఖరారు చేసి ఆఖరు క్షణంలో వాయిదాలు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 13న నిర్వహించిన కొబ్బరి చిప్పలు సేకరించే హక్కుకు సీల్డ్ టెండర్లు నిర్వహించారు. ఇందులో పాటదారులు రూ.లక్ష డిపాజిట్ చెల్లించి పాల్గొన్నారు. ప్రొద్దూటురుకు చెందిన ప్రసాద్ అనే పాటదారుడు రూ.15,20,000కు వేలం దక్కించుకున్నాడు. నిబంధనల మేరకు పాటదారుడు పాట మొత్తంలో 50 శాతం చెల్లించాల్సి ఉంది. మిగతా 50 శాతం మూడు నెలల్లోపు చెల్లించాలి. అయితే ఆలయ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి పాటదారుడితో 50 శాతం డబ్బు కట్టించుకోలేదు. నెల రోజుల పాటు అతన్ని డబ్బు కూడా అడగలేదు. పాట దక్కించుకున్న పాటదారుడు ఆలయంలో కొబ్బరి చిప్పల సేకరణ చేసి దాదాపు రూ.3 లక్షలకు పైగా సంపాదించుకుని ఆలయ ఆదాయానికి భారీగా గండి పడేలా చేశాడు. నెలరోజుల తరువాత తేరుకున్న ఆలయ ఈఓ పాటదారుడు డబ్బు చెల్లించకపోవడంతో తిరిగి కొత్త టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. టెండర్ల గోల్‌మాల్‌పై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాడిపత్రిలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
● వైఎస్సార్‌సీపీ నాయకుడి కారుకు నిప్పు
తాడిపత్రిటౌన్: వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం తాడిపత్రి పట్టణ ఉపాధ్యక్షుడు అలీకి చెందిన కారుకు టీడీపీ మూకలు మంగళవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయడాన్ని జీర్ణించుకోలేకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. ఎన్నికల నాటి నుంచి పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు రఘు అనుచరులు పవన్, జగన్, కమ్ము పలుమార్లు తనకు అడ్డుపడ్డారని, ఇంటి దగ్గరికి వచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
నేటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవాలు
ఉరవకొండ: దేశంలోనే ఎక్కడా లేని విధంగా పట్టణంలో దక్షణాభిముఖంగా వెలసిన శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి షష్ఠి, కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయానికి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉంది. 12న స్వామి వారికి ఐదు రకాల ఫలాలు, 11 కేజీల తేనెతో అభిషేకాలు, 13న 108 పచ్చి టెంకాయలతో అష్టోత్తర పూజ, లక్ష్మీ నారాయణస్వామి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, 14న 108 లీటర్లతో క్షీరాభిషేకం, 15న అభిజిత్ లగ్నంలో కల్యాణం, 16న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.


