తాడిపత్రి రూరల్: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 5,125 అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ నెల పాల ప్యాకెట్లు సరఫరా కాలేదు. నిబంధనల మేరకు ప్రతి నెలా 1న పాల ప్యాకెట్లను సరఫరా చేయాల్సి ఉంది. మిగిలిన సరుకులతో పాటు పాల ప్యాకెట్లను గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూలు చిన్నారులకు అందిస్తారు. ఈనెలలో 27 రోజులు కావొచ్చినా పాల సరఫరాపై కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. పాలప్యాకెట్లు రాకపోవడంతో మిగిలిన సరుకులను సరఫరా చేయాలా లేక అవి వచ్చేంత వరకు వేచి ఉండాలో తెలియక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. పాల సరఫరాపై సూపర్వైజర్లు సైతం స్పష్టత ఇవ్వడం లేదు.
అనంతపురం, సత్యసాయి జిల్లాలోని 24 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 5125 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 8 వేల మందికి పైగా గర్భిణులు, 24 వేలకుపైగా బాలింతలు ఉన్నారు. 0 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 2.60 లక్షలకు పైగా ఉన్నారు. వీరికి ప్రతి నెలా 8 లక్షలకుపైగా లీటర్ల పాలు సరఫరా కావాల్సి ఉంది. గర్భిణులకు రోజూ 200 ఎంఎల్ చొప్పున నెలకు 5 నుంచి 6 లీటర్ల పాలను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రీస్కూలు చిన్నారులకు 100 ఎంఎల్ చొప్పున అందించాలి. 27 రోజులుగా పాల సరఫరా ఆగిపోవడంతో పంపిణీ కూడా నిలిచిపోయింది.
ఎన్నికలపైనే దృష్టి..
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం, అధికారులు బిజీగా ఉండటంతో పాల ప్యాకెట్ల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పాలను కప్పిపుచ్చుకునేందుకు ఏకగ్రీవాలను ప్రోత్సహించడం, హింసాత్మక సంఘటనలకు పురిగొల్పడంలో పాలకులు బిజీగా ఉన్నారు. పాలకులు చెప్పినట్టు అధికారులు జీహుజూర్ అంటూ తమవంతు సహకారం అందిస్తున్నారు. దీని కారణంగా పాల సరఫరాపై కేఎంఎఫ్తో డీల్ కుదుర్చుకోవడం, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని
5,125 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కాని పాలు
ప్రతి నెలా రూ.8 లక్షల లీటర్లకు పైగా సరఫరా
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
బకాయిల చెల్లింపు, ధరల పెంపుపై కేఎంఎఫ్ పట్టు..
అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన పాలను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన పాలను ప్యాకెట్ల రూపంలో ఐసీడీఎస్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. రూ.కోట్ల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరల వల్ల గిట్టుబాటు కావడం లేదని, లీటర్కు రూ.5 చొప్పున పెంచాలని కేఎంఎఫ్ డిమాండ్ చేస్తోంది. దీని కారణంగా 2026–27కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈనేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ నెల కోటా పాల సరఫరా నిలిచిపోయింది. నవంబర్ కోటాపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
సక్రమంగా సరఫరా చేయాలి
అక్టోబర్ కోటాకు సంబంధించిన పాల ప్యాకెట్లు అంగన్వాడీ కేంద్రాలకు రాలేదు. కోటా వస్తుందో రాదో తెలియక అంగన్వాడీ టీచర్లు తికమకపడుతున్నారు. ప్రతి నెలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి.
– రమాదేవి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
నిలిచిన పాల సరఫరా..


