మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కేసు నమోదు

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

అనంతపురం సెంట్రల్‌: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్‌, నాయకులు లక్ష్మినారాయణ, శివకుమార్‌, ఆనంద్‌ ఆ సంఘం కార్యాలయంలో ఖండించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు.

కుందుర్పి ఎంపీడీఓగా

అసిస్టెంట్‌ కలెక్టర్‌

కుందుర్పి: ఐఏఎస్‌ క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాస్‌ కుమార్‌(ఐఏఎస్‌) సోమవారం కుందుర్పి ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. మండల అభివృద్ధి అధికారిగా నెలరోజుల పాటు విధులు నిర్వహించనున్నట్లు మండలస్థాయి అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అసిస్టెంట్‌ కలెక్టర్‌ మండలస్థాయి అధికారులతో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌

అనంతపురం: నార్పల మండల పరిధిలోని సిద్దరాచర్ల పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కృష్ణప్ప గొల్లపల్లిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన ఉద్యోగి రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వ సిబ్బంది రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను పక్కకు పెట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

అవినీతి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం

అనంతపురం సెంట్రల్‌: అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ 1064పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్‌ ఆవిష్కరించారు. అవినీతి నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌, 9440440057 వాట్సాప్‌ నంబర్‌లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ హమీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం

అదుపు తప్పి వ్యక్తి మృతి

ముదిగుబ్బ: మండల పరిధిలోని రాళ్లనంతపురం క్రాస్‌ సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి నగేష్‌ (44) మృతి చెందాడు. సీఐ రామసుబ్బయ్య వివరాల మేరకు.. బుక్కపట్నం మండలం మారాలకు చెందిన నగేష్‌ బత్తలపల్లి నుంచి పశువుల దాణా తీసుకొని వెళ్తున్నాడు. రాళ్లనంతపురం గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement