తాడిపత్రి రూరల్: పట్టణంలోని చింతల వేంకటరమణస్వామి దేవాలయంలో సోమవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీదేవి, శ్రీభూదేవి సమేత చింతల వేంకటరమణస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ వేదికపైకి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుసుకొచ్చారు. తర్వాత అర్చకులు మురళి అయ్యంగార్ల ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
ఘనంగా రథోత్సవం
భక్తుల హరినామస్మరణల మధ్య చింతల వేంకటరమణస్వామి రథోత్సవాన్ని సోమవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. మెయిన్ బజార్ మీదుగా ఊరేగింపు సాగింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి కర్పూర హారతులు, టెంకాయలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


