గుంతకల్లుటౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ కుటీల రాజకీయం మరోసారి బట్టబయలైంది. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచింది. పట్టణంలోని వివిధ వార్డుల పోటీ, సీట్ల సర్దుబాటు విషయమై కూటమి పార్టీల మధ్య చర్చలు జరిగినప్పటికీ జనసేన, బీజేపీకి కేటాయించిన 11 వార్డుల్లో కేవలం రెండు వార్డులు మినహా అన్నివార్డుల్లో సైతం టీడీపీ తమ పార్టీ అభ్యర్థులకు బీ–ఫారమ్‌లను అందజేసి వారిని బరిలోకి దింపింది. దీంతో ఆయా పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. రెబల్‌గా వేసిన నామినేషన్లను విత్‌డ్రా చేయించాలని ఆయా పార్టీల జిల్లా నేతల నుంచి స్థానిక టీడీపీ నేతలపై ఒత్తిళ్లు తెచ్చినా ఎవరూ స్పందించలేదు. దీంతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన స్థానిక టీడీపీ నేతలపై బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులు రగిలిపోతున్నారు. కూటమి పార్టీ నేతల్లో సమన్వయ లోపమే కారణమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరిదారి వారిదే..
గుంతకల్లు మున్సిపాల్టీలోని మొత్తం 48 వార్డుల్లో 11 వార్డులు(జనసేనకు 7, బీజేపీకి 4) సీట్లు కేటాయిస్తూ స్థానిక కూటమి పార్టీల నేతలు నిర్ణయించారు. బీజేపీకి 4, 8, 26, 33 వార్డులు, జనసేనకు 11, 14, 15, 22, 24, 30, 39 వార్డులు మిగిలిన 37 వార్డుల్లో టీడీపీ పోటీచేసేలా సర్దుబాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన జిల్లా అధినాయకులు కౌన్సిలర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులకు పంపిన బీ–ఫారమ్‌లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అయితే బీజేపీకి కేటాయించిన 33వ వార్డు, జనసేనకు కేటాయించిన 11వ వార్డు మినహా 46 వార్డుల్లోనూ టీడీపీ బరిలో దిగింది. వీరందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంపిన బీ–ఫారమ్‌లను ఎన్నికల అధికారులకు అందజేశారు. కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటులో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. దాఖలు చేసిన నామినేషన్లను టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోకపోవడంతో కూటమి పార్టీల మధ్యనే పోటీ అనివార్యం కానుంది. కూటమిలోనే ఒకరికొకరు రెబల్ అభ్యర్థులుగా మారారు. అప్పుడే వార్డుల్లో మూడు పార్టీల నేతలు కూడా విస్త్రృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
అధినేత ఆదేశాలను లెక్కచేయని తమ్ముళ్లు
కూటమి పార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు నేపథ్యంలో జనసేన, బీజేపీలకు కేటాయించిన వార్డుల్లో రెబల్‌గా టీడీపీ అభ్యర్థులు పోటీ చేయరాదని, అలా చేస్తే పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తానని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియోలను జనసేన, బీజేపీ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. మిత్ర ధర్మానికి తూట్లు పొడిచి అధినేత ఆదేశాలను ఖాతరు చేయని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు
జనసేన, బీజేపీ వార్డుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు
గుత్తిలోనూ అంతే...
గుత్తి: మున్సిపాలిటీలో అడిగినన్ని కౌన్సిలర్ స్థానాలు ఇవ్వలేదని, ఇచ్చిన మూడింటిలో కూడా టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండటంపై జనసైనికులు లోలోపల మదన పడుతున్నారు. ఇదేక్కడి పొత్తు ధర్మమని ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. గుంతకల్లు నియోజకవర్గం జనసేన సమన్వయ కర్త వాసగిరి మణికంఠ తమ పార్టీకి ఏడు స్థానాలు అడిగారు. తర్వాత ఐదుకు ఆ తర్వాత నాలుగుకు, అటు తర్వాత మూడుకు దిగారు. అయినా మూడింటిలో కూడా పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. దీంతో పోటీ అనివార్యమైంది. 32 వార్డుల్లో 27 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కూటమిలోని భాగస్వాములైన జనసేన, బీజేపీ అభ్యర్థులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. మిగతా ఐదింటిలో పోటీ ఉండదనుకుంటే టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగారు. 2వ వార్డులో జనసేన అభ్యర్థిగా గద్దల కార్తీక్ , టీడీపీ తరుఫున కుమార్ బరిలో ఉన్నారు. అదే విధంగా 4వ వార్డులో జనసేన తరుపున తులసీరాం, టీడీపీ తరుపున వరలక్ష్మి బరిలో నిలిచారు. 26వ వార్డులో జనసేన తరుపున పోతురాజు చిన్న వెంకటేష్, టీడీపీ తరుపున గోపాల కృష్ణ బరిలో నిలిచారు. ఇక 10వ వార్డులో టీడీపీ తరుపున అబ్దుల్ వహాబ్, టీడీపీ రెబల్ శ్రీదేవి పోటీలో ఉన్నారు. 24వ వార్డులో సీపీఎం తరుఫున నిర్మల, బీజేపీ తరుఫున లక్ష్మి బరిలో నిలిచారు.


