జెడ్పీ పీఠం కోసం పోటాపోటీ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం కోసం పోటాపోటీ

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం కూటమి నేతల మధ్య పోటా పోటీ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తున్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పొత్తుల వ్యవహారం నేటికీ సందిగ్ధంగానే కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని తమకే కేటాయిస్తారన్న గంపెడంత ఆశతో జనసైనికులు ఉత్సాహంతో నామినేషన్లు దాఖలు చేశారు. తీరా అసలు సమయం ఆసన్నమయ్యే కొద్దీ అనంత జిల్లా పరిషత్‌ కేటాయింపును ఎటు తేల్చకుండా మిగిల్చారు. మిత్రపక్షాలలో ప్రధాన భూమికను పోషిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ పార్టీకి కేటాయించకుండా తమ వద్దే ఉంచుకోవాలని టీడీపీలో అంతర్గతంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జెడ్పీ పీఠాన్ని తమ పార్టీ కై వసం చేసుకుందన్న ధీమాతో తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో ఆ పార్టీలోని ఆ వర్గం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వారిలో ప్రధానంగా శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలోని నేతల మధ్య అధిక పోటీ ఉన్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు జెడ్పీ పీఠమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా శింగనమల నియోజకవర్గ పరిధిలోని గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వారితో పాటు మరికొందరు ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో తమదైన శైలిలో జిల్లా స్థాయిలోనూ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. గార్లదిన్నె జెడ్పీటీసీ స్థానం కోసం ఇప్పటికే నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

టీడీపీలో పెరుగుతున్న

ఆశావహుల సంఖ్య

శింగనమల నియోజకవర్గం

నేతలదేనని ప్రచారం

జెడ్పీ పీఠంపై వెనక్కి

తగ్గేదిలేదంటున్న జనసేన నేతలు

త్యాగానికి ఓ హద్దు ఉంటుందని

స్పష్టీకరణ

జెడ్పీ పీఠంపై జనసేన కన్ను

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గిరిని మొదట్లో జనసేనకు కేటాయిస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు జనసైనికులు చెబుతున్నారు. ఎలాగైనా అనంత జెడ్పీని తామే దక్కించుకోవాలన్న వ్యూహం రచిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానాలను వదులుకున్నాం, అలాగే నామినేటెడ్‌ పదవుల విషయంలో కూడా తాము రాజీపడ్డాం, చివరకు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మాన్ని పాటించాం, అనంతపురం మేయర్‌ పదవిని సైతం త్యాగం చేశాం.. ఇక ఎంతకాలం ఈ విధంగా తాము పొత్తు ధర్మం పేరుతో పల్లకీ మోయాలని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా సరే తాము ఈసారి జిల్లా పరిషత్‌ను దక్కించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు జెడ్పీటీసీ స్థానాలు, ఐదు నుంచి ఆరు ఎంపీటీసీ స్థానాలను తాము కోరుకున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు చెబుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అనంతపురం జిల్లా పరిషత్‌ విషయంలో గట్టిగానే ఉన్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ కూటమిలో పొత్తు ధర్మం పాటించకపోతే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement