పయ్యావుల ఇలాకాలో కుటిల రాజకీయం | - | Sakshi
Sakshi News home page

పయ్యావుల ఇలాకాలో కుటిల రాజకీయం

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

ఉరవకొండ: హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడం.. సంక్షేమ ఫలాలు అరకొరగా అందించడం.. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకడం.. అధికార కూటమికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా గెలిచి తీరాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి.. ‘పచ్చ’ కుట్రలకు తెరలేపింది. ఇందు కోసం నామినేషన్ల ప్రక్రియకు ముందు నుంచే వైఎస్సార్‌సీపీని నిలువరించాలని వ్యూహ రచన చేసింది. ఉరవకొండలో పోలీసుల సహకారంతో ‘బైండోవర్‌ పాలిటిక్స్‌’ అమలు చేసింది. వైఎస్సార్‌సీపీలోని ముఖ్య నేతలందరినీ ‘శాంతిభద్రతల’ పేరుతో స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికలను ఏకపక్షంగా చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో పాటు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే ఇబ్బంది పడుతారంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండుగ పూట కూడా ఉరవకొండ అర్బన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్లతో పాటు ఆయా మండలాల్లోని పోలీస్‌ స్టేషన్లకు పార్టీ నాయకులు, కార్యకర్తలను రప్పించి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పెట్టుకుని పంపారు. నియోజకవర్గంలో కొంతమంది సీఐలు ‘పచ్చ’ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

‘బైండోవర్‌’పై ఎస్పీకి ఫిర్యాదు..

పోలీసులు ఇష్టారాజ్యంగా బైండోవర్‌లు నమోదు చేసి.. స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఫోన్‌ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలు కొందరిని పోలీస్‌స్టేషన్లకు రావాలంటూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

రాప్తాడులోనూ అదే తంతు..

రాప్తాడు రూరల్‌: స్థానిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్‌ కేసుల నమోదులో పోలీసులు పక్షపాత వైఖరి అనుసరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టడంలో భాగంగా పోలీసుల ముందస్తు చర్యలపై ప్రజలకు నమ్మకం కలిగాలి. కానీ అనంతపురం రూరల్‌ మండలంలోని గ్రామాల్లో పోలీసులు ప్రతిపక్ష పార్టీల వారినే తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌లు చేస్తున్నారని విమర్శలున్నాయి.

ప్రతిపక్షానికే నిబంధనలా?

గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత. అయితే ఈ చర్యలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సమానంగా ఉండాలి. అనంతపురం రూరల్‌ మండలంలోని కొన్ని గ్రామాల్లో నేర చరిత్ర లేని ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులను సైతం బైండోవర్‌ ప్రక్రియ చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీకి చెందిన కొందరిని మాత్రమే స్టేషన్‌కు పిలుస్తున్నారని, వారిపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయనే వాదన ఉంది. ఇటీవల కొడిమి, నరసనాయనికుంట, తాటిచెర్ల, సోములదొడ్డి, రాచానపల్లి, కక్కలపల్లికాలనీ, కామారుపల్లి, ఆలమూరు, కట్టకిందపల్లి తదితర గ్రామాల్లో చురుగ్గా ఉన్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను తహసీల్దారు వద్దకు తీసుకెళ్లి బైండోవర్‌ చేయించారు. ఏకపక్షంగా బైండోవర్‌లు చేయడంపై కొందరు పోలీసు అధికారులను ప్రశ్నిస్తే...‘వారిని మళ్లీ బైండోవర్‌ చేస్తాం’ అంటూ మాట దాటవేసినట్టు చెబుతున్నారు.

ఎన్నికల వేళ ఏకపక్ష హెచ్చరికలా?

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సమస్యాత్మక వ్యక్తులను గుర్తించడం, అవసరమైన చోట చట్టప్రకారం బైండోవర్‌ చర్యలు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ చర్యలు అధికార పార్టీ అనుకూలంగా ఉంటే ఎన్నికలు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయనే వాదన ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తోంది. అనంతపురం రూరల్‌ మండలంలో పోలీసుల ఏకపక్ష బైండోవర్‌లపై ఉన్నతాధికారులు దృష్టి సారించి స్థానిక ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘కూటమి’ కుట్రలు

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై

అక్రమంగా బైండోవర్‌ కేసులు

స్టేషన్ల చుట్టూ తిప్పి.. భయపెట్టి

ఏకపక్షం చేసుకునే ఎత్తుగడ

70 శాతం వైఎస్సార్‌సీపీ నేతల పైనే..

నియోజకవర్గంలో మొత్తం బైండోవర్‌ కేసుల్లో 70 శాతం వైఎస్సార్‌సీపీ నేతలపైనే నమోదయ్యాయి. కూటమి నాయకుల డైరెక్షన్‌లో ఉరవకొండ, కూడేరు, బెళుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల పరిధిలో దాదాపు 70 మంది పార్టీ నాయకులపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఉరవకొండ అర్బన్‌ పోలీసు స్టేషన్‌కు సోమవారం 15 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను పిలిచి బైండోవర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement