నార్పల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన సంఘటన సోమవారం ఉదయం నార్పలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. స్థానిక ఎన్నికల్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు మద్దతివ్వాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆమె వెంట వచ్చిన ఆలం నరసానాయుడు, ఉమామహేశ్వరనాయుడులతో కలిసి మండల కేంద్రంలోని టీడీపీ నాయకుడు ఆకుల ఆంజనేయులును కోరారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆకుల బాబు కలగచేసుకుని ‘మీకు మేము ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తామని, ఎన్నికల అయిపోయిన తర్వాత మేము గుర్తుండమని’అనడంతో ఆలం వెంకటనరసానాయుడు, ఉమామహేశ్వరనాయుడ ఒక వర్గంగా మారి ఆకుల బాబుతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఇది గమనించిన పోలీసులు, చుట్టు పక్కలవారు పరిస్థితి చేజారిపోతుందని ఆలం వర్గీయులను అక్కడ నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది.
ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు
అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా దుర్మార్గంగా అడ్డుకోవడాన్ని సీపీఎం జిల్లా కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నామినేషన్ల అడ్డగింతపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో జగదీష్‌తోపాటు జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అధికార పార్టీ నాయకులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
సీపీఐ నుంచి టి.రంగయ్య సస్పెండ్
తాడిపత్రి సీపీఐ నాయకుడు టి.రంగయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు పాళ్యం నారాయణస్వామి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీతో పొత్తులో భాగంగా 17వ డీవిజన్ అభ్యర్థిగా రంగయ్యను నిర్ణయించగా, ఆయన నామినేషన్ వేయకుండా అవతలి పార్టీకి మేలు చేసేలా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు.


