ఘనంగా ఆయుధపూజ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆయుధపూజ

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆయుధాగరంలో పోలీసులు వినియోగించే ఆయుధాలకు, మోటార్‌ ట్రాన్స్‌పోర్టు విభాగంలోని వాహనాలకు పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసు కుటుంబాలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ ఇలియాస్‌బాషా, రూరల్‌ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ అశ్విన్‌ మణిదీప్‌, డీఎస్పీలు కరుణాకర్‌రావు, నీలకంఠేశ్వరెడ్డి, డీపీఓ, ఏఆర్‌ అధికారులు పాల్గొన్నారు.

తల్లిపై అలిగి

ఇంటి నుంచి వెళ్లి..

● కుంటలో దూకి ఇంటర్‌

విద్యార్థి ఆత్మహత్య

పెద్దవడుగూరు: మండల పరిధిలోని కాశేపల్లి గ్రామానికి చెందిన కాశిరెడ్డి(18) అనే ఇంటర్‌ విద్యార్థి తల్లి మందలించడంతో క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోయి నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాశిరెడ్డి తల్లి పండుగ ఉండడంతో ఆదివారం ఇల్లు సర్దుకుంటోంది. ఇంటికి వచ్చిన కాశిరెడ్డి ఆకలవుతోంది, అన్నం పెట్టాలని తల్లికి చెప్పాడు. పనిలో ఉన్నా, అన్నం చేయడం ఆలస్యమవుతుందని తల్లి చెప్పడంతో వాదనకు దిగాడు. అనంతరం కాశిరెడ్డి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులు గ్రామంలో గాలించారు. అలానే తోటి మిత్రులను ఆరా తీశారు. ప్రయోజనం లేకపోవడంతో ఆలస్యమైనా ఇంటికి వస్తాడులే అని భావించారు. సోమవారం ఉదయం చెన్నారెడ్డి పొలం సమీపంలోని కుంట వద్దకు వెళ్లిన పశువుల కాపర్లు ఓ వ్యక్తి మృతదేహం నీటిపై తేలాడుతున్న దృశ్యాన్ని గమనించి గ్రామస్తులకు చేరవేశారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలియజేశారు.

అప్పుల బాధతో రైతు..

తాడిపత్రి రూరల్‌ : వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్టు అప్‌గ్రేడ్‌ పోలీసు స్టేషన్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి (60) తనకున్న పొలంలో వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయాడన్నారు. ఈ ఏడాది కూడా సాగు చేసిన కందిపంట వర్షాబావం వల్ల దెబ్బతినడంతో మనస్తాపానికి గురై ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు మల్లారెడ్డిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడని సీఐ తెలిపారు. కుమారుడు నాగవీర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

ఉరివేసుకుని యువకుడు..

గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరుకు చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ బాషా తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ముకేష్‌(22) అనే యువకుడికి భార్య సంవత్సరం క్రితం విడాకులు ఇచ్చిందన్నారు. రెండో పెళ్లి కాకపోవడతో రోజూ మదనపడుతుండేవాడన్నారు. దీంతో మద్యానికి బానిసవ్వగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముకేష్‌ను పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారని ఎస్‌ఐ తెలియజేశారు. తండ్రి దేవాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

బాలికకు వేధింపులు

● పోక్సో కేసు నమోదు

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): డి.హీరేహాళ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్రంలోని పెన్నంపల్లి గ్రామానికి చెందిన పరమేష్‌ అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement