సాక్షి ప్రతినిధి, అనంతపురం: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. పైకి అంతా బాగుందని నటిస్తూ లోలోపల కత్తులు దూసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ, జనసేనకు మూడు స్థానాలు మాత్రమే కేటాయించారు. అనంతపురం మేయర్ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. పుట్టపర్తి, మడకశిర మున్సిపల్ చైర్మన్ స్థానాలను జనసేనకు కేటాయించారు. వాస్తవానికి ఈ మూడు స్థానాల్లో ఆయా పార్టీలకు ఎలాంటి సంస్థాగత నిర్మాణమూ లేదు. కేడర్ కూడా లేకుండానే పొత్తులో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది.
బరిలో భారీగా అభ్యర్థులు..
అనంతపురం నగరపాలక సంస్థలో 62 డివిజన్లకు టీడీపీ నుంచి 197 మంది, జనసేన నుంచి 24 మంది, బీజేపీ నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నాటికి కూడా ఏ పార్టీ ఏయే డివిజన్లలో పోటీ చేయాలో నిర్ణయించుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో బరిలో ఎవరుంటారో.. రెబల్‌గా ఎవరు నిలుస్తారో తెలియక కేడర్ అయోమయంలో పడింది. అయితే స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గం.. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి వర్గం వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో టీడీపీలో ‘నిప్పు’ రాజుకున్నట్లయ్యింది. వైకుంఠం వర్గానికి చెందిన సందీప్ చౌదరి 42వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం స్క్రూటినీ ప్రక్రియ కోసం కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు సందీప్ నుంచి బలవంతంగా పత్రాలు లాక్కుని, దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో అక్కడున్న పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి పంపించారు.
గుంతకల్లులోనూ అంతే...
గుంతకల్లు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి యశోదగౌడ్ నామినేషన్ వేశారు. అయితే ఇదే స్థానాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్ తన బంధువు రాజేశ్వరికి ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్యే జయరాం కూడా రాజేశ్వరి అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు. అయితే మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ చక్రం తిప్పి సీటును తన వర్గానికి కేటాయించుకున్నారు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం
వార్డుల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేసిన వైనం
రెబల్స్‌గా బరిలోకి దిగుతారనే భయంలో నేతలు


