వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

Oct 20 2026 1:50 AM | Updated on Oct 20 2026 1:50 AM

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఓటమి ఖాయమని తెలిసి ‘పచ్చ’ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురంలోని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో నవోదయ కాలనీకి చెందిన టీడీపీ బూత్‌ కన్వీనర్‌, ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గాయత్రితో పాటు 27, 29 డివిజన్లకు చెందిన పలు కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన అనంతపురంలో రెండున్నరేళ్లుగా దోపిడీలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని సామాన్యుల ఇళ్లు, స్థలాలను ఆక్రమిస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పేదలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఎమ్మెల్యే అనుచరులు బహిరంగంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడిపై భారం పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం..

చంద్రబాబు పాలనతో నగర ప్రజలు విసుగు చెందారని, ప్రస్తుతం ఏ డివిజన్‌కు వెళ్లినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అనంత తెలిపారు. మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌తో పాటు 62 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు గట్టి పట్టుదలతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ సంపంగి రామాంజనేయులు, నాయకులు చిరంజీవి, గుజ్జల నారాయణ, సంపంగి రవికుమార్‌, సర్దార్‌, తిరుపాలు, శశిధర్‌ రెడ్డి, విజయ్‌, మధు, శ్రీరాములు, హుస్సేన్‌, సాకే రామాంజనేయులు, నాగరాజు, ప్రభాకర్‌, దివాంజీ రాావు, శివశంకర్‌, నారాయణస్వామి, వెంకీ, ఆదామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement