● చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత మండిపాటు
అనంతపురం : విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన దమన కాండను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఖండించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా స్టేషన్లలో నిర్బంధించడం పాశవిక చర్యగా అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమం అందించేందుకు 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా పాలన సాగించామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వారిని విధుల నుంచి తొలగించారన్నారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తూ, అదనపు పనిభారంతో వేధిస్తున్నారని విమర్శించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ విధానం, జీఓ 11 రద్దు, జీఓ 5 పునఃసమీక్ష కోరడమే ఉద్యోగులు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
వంచనకు గురైన ఉద్యోగులు
గత రెండున్నరేళ్లుగా ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్‌సీ చైర్మన్‌ను కూడా నియమించలేదని అనంత విమర్శించారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అందించకుండా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకునేందుకు కొత్త పింఛన్ల డ్రామా ఆడుతోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అక్రమాలను ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు.
డివిజన్ల విభజన అసంబద్ధం
అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్న 50 డివిజన్లను 62 డివిజన్లుగా పెంచిన తీరు అసంబద్ధంగా ఉందని అనంత వెంకటరామిరెడ్డి తప్పు పట్టారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా కాకుండా టీడీపీ నేతల స్వలాభం కోసం డివిజన్లను మార్పులు, చేర్పులు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు ప్రక్రియను క్రాస్ చెక్ చేసి, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌ను కోరారు.
ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీపై విమర్శలు
టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టేందుకే ‘ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ’ తీసుకొచ్చారని, గతంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన సోషల్ మీడియా ఐడీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు తన అసత్య ప్రచారాలకు రూ.కోట్లు ఖర్చు చేస్తోందని విరుచుకుపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మాజీ కార్పొరేటర్ గుణశేఖర్ బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, సాంస్కృతిక విభాగం నగర కార్యదర్శి కేశవరెడ్డి పాల్గొన్నారు.


