భగ్గుమంటున్న భానుడు
● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
అనంతపురం అగ్రికల్చర్: భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎండలు బాగా పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల మేర గరిష్టంగా నమోదయ్యాయి. దీంతో మండే ఎండలతో పాటు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సెప్టెంబర్ మొదటి వారంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత మార్క్‌ను చేరుకోవడం ఆందోళన కలిగించాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో అంతుచిక్కని వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల మొదటి నుంచి 18వ తేదీ వరకు ఎండలు మండిపోయాయి. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఐదారు రోజులు వర్షాలు కురవడంతో పరిస్థితి కుదుటపడేలా కనిపించింది. అయితే వర్షాలు ఆగిపోగానే మళ్లీ సూరీడు ప్రతాపం చూపిస్తుండటం గమనార్హం. వేసవిని తలపించేలా గ్రీష్మతాపం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు ఈసారి సకాలంలో ప్రవేశించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్, జూలై మాసాల్లో 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండలు మండిపోయాయి. మధ్య మధ్యలో తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షాలు నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్ సాగు అస్తవ్యస్తం కాగా.. ప్రత్యామ్నాయ పంటల సాగు చిన్నబోయింది. ఆశలు పెట్టుకున్న రబీ ఏ మాత్రం ఆదుకుంటుందనేది అక్టోబర్ వర్షాలపై ఆధారపడి ఉంది.


