● పరిష్కార వేదికకు వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్ ఆనంద్‌తోపాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి ప్రజల నుంచి 497 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ అంశాలకు సంబంధించి 255 అర్జీలు కాగా.. ఇతర సమస్యలపై 242 అందాయి. కార్యక్రమానికి ముందు అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
ఇసుక రీచ్ ఏర్పాటు చేయొద్దు
యల్లనూరు మండలం మల్లాగుండ్ల సమీపాన చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయవద్దని చుట్టుపక్కల ఏడు గ్రామాల రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అసలే కరువు పరిస్థితులు, అరకొర నీటితో పంటలను అసంపూర్తిగా పండించుకుంటున్నామని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే తాము మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ పరిశీలించి... న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
‘స్థానిక’ ఎన్నికల సామగ్రి వచ్చేసింది!
అనంతపురం న్యూటౌన్: జిల్లాలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే మండల పరిషత్ ప్రాదేశిక, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పూర్తి కావస్తున్నాయి. సోమవారం ఎన్నికల సిబ్బందికి సంబంధించిన వివిధ రకాల హ్యాండ్ బుక్కులు జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఇందులో ఎన్నికల చోట్ల నియమావళి మాన్యువల్, రిటర్నింగ్ అధికారులు అనుసరించాల్సిన నిబంధనావళి, ప్రిసైడింగ్ అధికారుల పుస్తకాలు, సూచనల సంకలనాలు, ఎన్నికల్లో పోటీ చేసే అఽభ్యర్థుల నియమావళి పుస్తకాలు, నామినేషన్ ఫారాలు, విత్‌డ్రా ఫారాలు, ఏజెంట్ నియామక ఫారాలు, పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు, ఇతర ఎన్నికల ఫారాలు కలిపి మొత్తంగా 20 రకాల పత్రాలు, పుస్తకాలు తదితర సామగ్రి వచ్చినట్లు జిల్లాపరిషత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.


