అనంతపురం అర్బన్: ట్రాన్స్‌మిషన్ టవర్ల నిర్మాణ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అపోహలు తొలగించేందుకు రైతుల కోసం రెజోనియా కంపెనీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సమస్యలను రైతులు 1800 309 4401 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెజోనియా టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పునరుత్పత్తిలో భాగంగా ఇక్కడికి తరలివచ్చిన కంపెనీలకు, రైతులకు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. సమాచార మార్పిడి, పారదర్శకత, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు రైతులకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. రైతులు నేరుగా మాట్లాడడం వల్ల దళారీ వ్యవస్థకు అవకాశం ఉండదన్నారు. కంపెనీ ప్రాజెక్టు హెడ్ గిరిప్రసాద్, ఆర్‌ఓడబ్ల్యూ మేనేజర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అనంతపురం అర్బన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఖాళీలకు సంబంధించి రోస్టర్ సమర్పించని సీడీపీఓలకు చార్జ్‌మెమో జారీ చేయాలని పీడీని ఆదేశించారు. జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగంతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ సేవల అమలు, పోషకాహారం పంపిణీ, ఖాళీ పోస్టుల భర్తీ, పిల్లలు హాజరు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. కంబదూరు ప్రాజెక్టలో ఎస్‌ఎన్‌పీ (సప్లిమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం) పంపిణీలో చివరిస్థానంలో ఉందంటూ ఆగ్రహించారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. సమావేశంలో డీఈఓ అయూబ్ హుసేన్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


