● ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి లేఖ
ఉరవకొండ: అరుదైన వ్యాధుల బాధిత చిన్నారులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు లేఖలు రాశారు. పేద వర్గాల ప్రజలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రోగాల బారిన పడ్డ పేద కుటుంబాల కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ విధానం అమలు చేసి ఆదుకోవాలన్నారు. స్పైనల్ మస్కలర్ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ), మస్కలర్ డిస్టరీ (డీఎండీ) లాంటి అరుదైన వ్యాధుల వైద్యానికి దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందన్నారు. ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడితే పేద ప్రాణాలు పోవాల్సిందేనా? అని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరుదైన వ్యాధుల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఆయా వ్యాధుల బారిన పడిన వెంటనే చికిత్స అందించే ఆసుపత్రి వివరాలతో పాటు రోగుల వివరాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేలా ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేయాలని కోరారు. వైద్యాధికారి మానిటరింగ్ చేసేలా సిస్టం ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి ‘ఎల్‌ఓసీ’ ఆలస్యం లేకుండా అందించాలన్నారు. వ్యాధిని గుర్తించిన వెంటనే వేగంగా స్పందించడం, సరైన వైద్యమందించి వారి ప్రాణాలను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.


