● వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
పామిడి/పెద్దవడుగూరు/గుత్తి/గుత్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో వర్షాభావంతో ఎండిన పంటల పొలాలు, పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలోని పత్తి పంట పొలాలను పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంటల బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించిందన్నారు. కరువు ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్న రైతుల నుంచి ముక్కుపిండి బీమా ప్రీమియం కట్టించుకున్నట్లు గుర్తు చేశారు. అనంతరం వారు పామిడి మండలం గజరాంపల్లిలో రైతులతో ముఖాముఖీగా మాట్లాడారు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామ పరిధిలో 500 మంది దాకా రైతులు 1500 ఎకరాల్లో కొర్ర, కంది, పత్తి, జొన్న, దోస పంటలు సాగు చేసినట్లు రైతులు నాగేంద్రరెడ్డి, దేవేంద్ర, తిప్పారెడ్డి, బొజ్జిరెడ్డి, రమేష్ తదితరులు తెలిపారు. ప్రభు త్వం ఎకరాకు రూ.25వేల చొప్పున పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, రూరల్ కన్వీనర్ రమావత్ రామకృష్ణనాయక్, మూలి నాగేశ్వర్ రెడ్డి, మండలనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులూ.. పంట పొలాల దుస్థితిని చూడండి
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరువుతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎస్‌విఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్‌కుమార్‌రెడ్డి ,అనంతపురం వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి విమర్శించారు. పెద్దవడుగూరు మండలం మండలం కాశేపల్లి వద్ద పత్తి పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు దేవమోహన్‌రెడ్డి, ఎద్దుల సూర్యప్రభాకర్‌రెడ్డి, రామాంజులరెడ్డి, భూషణ, దొరస్వామిరెడ్డి, శేఖర్, సూర్యనారాయణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, శ్రీరామిరెడ్డి, దిమ్మగుడి మోహన్‌రెడ్డి, నాగభూషణ, ప్రసాద్, హనుమంతరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి..
రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పంటల పరిస్థితులను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలనే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతు విభాగం నాయకులు బుధవారం జిల్లాలో పర్యటించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల మీదగా గుత్తి, గుత్తి రూరల్ మండలంలోని వన్నేదొడ్డి, కొత్తపేట శివార్లలోని పంట పొలాలను వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డితో కలిసివైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్‌కుమార్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా నాగిరెడ్డి..రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగతో పాటు పత్తి, మొక్కజొన్న, సజ్జ పంటలు కూడా దెబ్బతిన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కరువు, చంద్రబాబు కవలలు అని రాష్‌ట్రమంతా కోడై కూస్తోందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా రాష్ట్రంలో దుర్భిక్షం తలెత్తుతుందన్నారు. రైతులు అన్ని విధాల నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు సీవీ రంగారెడ్డి, గురు ప్రసాద్ యాదవ్, వరలక్ష్మి, వాల్మీకి శివ, రామరంగారెడ్డి, రామసుబ్బారెడ్డి, జీపు రమణ, జయరామిరెడ్డి, దస్తగిరి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


