డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): ‘ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే సమయం లేకపోతే ఇంటికి వెళ్లిపోండి’ అంటూ జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి నాసరరెడ్డి హెచ్చరించారు. బుధవారం డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం, మడేనాహాళ్లి గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది పని తీరు సక్రమంగా లేదన్నారు. అందుబాటులో ఉండడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. సర్వేలు కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం మండలంలో పలు మీసేవా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దాసానాయక్, డిప్యూటీ ఎంపీడీఓ యోగానంద తదితరులు పాల్గొన్నారు.


