అక్రమాల్లో రిజి‘స్టార్‌’ | - | Sakshi
Sakshi News home page

అక్రమాల్లో రిజి‘స్టార్‌’

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

అనంతపురం టౌన్‌: కళ్యాణదుర్గం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆయనో సబ్‌ రిజి‘స్టార్‌’గా వెలుగుతున్నారు.. పైసలే పరమావధిగా పనిచేస్తున్నారు.. ప్రభుత్వ భూములైనా.. నిషేధిత భూములైనా సరే.. కళ్లు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తూ అందిన కాటికి దోచుకుంటున్నారు.. ఈయనకు స్థానిక ఓ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కళ్లెదుటే సబ్‌ రిజి స్ట్రార్‌ చేసిన అక్రమాలు కనిపిస్తున్నా చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన

అక్రమాలు మచ్చుకు కొన్ని:

● కంబదూరు మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 691–2లో 4.90 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ భూమి నిషేదిత జాబితాలో ఉంది. ఈ భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి క్రయ,విక్రయాలు చేపట్టరాదు. అయితే ఈ భూమిని ఇటీవల సెప్టెంబర్‌ 9న భాగపరిష్కారాల డాక్యుమెంట్‌ నంబర్‌ 8147–2026 పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఒకరోజు వ్యవధిలోనే ఇదే నెల 10న డాక్యుమెంట్‌ నంబర్‌ 8199–2026 పేరిట అపర్ణ పేరిట సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోను రిజిస్ట్రేషన్‌ చేయరాదు. అయినా కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసేశారు.

● బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామం సర్వే నంబర్‌ 308–2లో రెండెకరాల స్థలం ఉంది. ఈ భూమి సైతం నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమిని సైతం కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆగస్టు 27న డాక్యుమెంట్‌ నంబర్‌ 7739–2026 పేరిట సేల్‌ డీడ్‌ చేశారు.

● కళ్యాణదుర్గం మండలం వెస్టుకోడిపల్లిలో అసలైన భూ యజమానుల ప్రమేయం లేకుండానే వేరొకరి పేరిట డాక్యుమెంట్‌ నంబర్‌ 3781–2026 పేరిట ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూయజమానులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గత నెలలో రిజిస్ట్రేషన్‌ రద్దు చేశాడు. కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాలపై అనేకమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకునే సాహసం మాత్రం అధికారులు చేయడం లేదు. ఇతనికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సబ్‌ రిజిస్ట్రార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో?

ఇంత పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు చేస్తు న్నారు. ఈయన చేసిన అక్రమాలు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మెల్యే అమిలినేనితో సబ్‌ రిజిస్ట్రార్‌ రామ్మోహన్‌ (ఫైల్‌)

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌

యథేచ్ఛగా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌కు అండగా ప్రజాప్రతినిధులు

చర్యలకు వెనకడుగు వేస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement