నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు సీజ్‌

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

అనంతపురం క్రైం: నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం, విక్రయాలపై అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ డా. రాజా రవీంద్రనాథ్‌ చౌదరి ఆధ్వర్యంలో పాతూరు ప్రాంతంలో సుమారు 15 దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1.49 లక్షలకు పైగా జరిమానా విధించారు. నగరంలోని ఆరు సర్కిళ్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్‌ సెకట్రరీలు తనిఖీల్లో పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

కణేకల్లు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా షాబిద్‌

కణేకల్లు: కణేకల్లు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎస్‌.షాబిద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. షాబిద్‌ను ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో 2023లో నిషేదిత భూములకు అప్పట్లో సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న (మొన్నటి వరకు కణేకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌) బసవరాజు రిజిస్ట్రేషన్‌ చేయడంతో అతనితోపాటు సీనియర్‌ అసిస్టెంట్‌ మంజునాథయాదవ్‌ను డీఐజీ సస్పెండ్‌ చేశారు. దీంతో కణేకల్లు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా షాబిద్‌ను నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. షాబిద్‌ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఉన్నతాధికారులు కణేకల్లు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

నిరంతర నిఘా కొనసాగాలి

అనంతపురం అర్బన్‌: ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్ద నిరంతర నిఘా కొనసాగాలని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాత ఆర్డీఓ కారాలయ ఆవరణలోని గోదాములో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. లాగ్‌ బుక్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాము వద్ద పటిష్ట భద్రత ఉండాలన్నారు. సీసీ కెమెరాలు నిరంతరాయంగా పని చేయాలన్నారు. గోదాము పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఎన్నికల డీటీ కనకరాజ్‌, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌, పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరావు, మసూద్‌వలి, రామాంజనేయులు, శ్యాంప్రసాద్‌, ఇమామ్‌ పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న మద్యంషాపుల రెన్యూవల్‌

అనంతపురం సెంట్రల్‌: మద్యం షాపులకు రెన్యూవల్‌ గడువు బుధవారంతో ముగుస్తుందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వైటీ ప్రసాద్‌, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కార్యాలయంలో మద్యం షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 138 మద్యం షాపులకు గాను ఇప్పటి వరకూ 95 షాపులు రెన్యూవల్‌ అయినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం వరకూ రెన్యూవల్‌ చేసుకోవడానికి గడువు ఉందని వివరించారు. రెన్యూవల్‌ కాని షాపులకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి షాపులకు 10 దరఖాస్తులు తప్పనిసరిగా రావాలని, రూ.3 లక్షలు నాన్‌ రీఫండబుల్‌ అమౌంట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్సు సీఐ జయనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ జయ నరసింహ, మద్యం షాపుల యజమానులు పాల్గొన్నారు.

క్యాంపస్‌ హాస్టల్‌లో ఘర్షణ

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహంలో ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యార్థినుల మధ్య గ్యాంగ్‌వార్‌ చోటు చేసుకుంది. వాష్‌రూంకు సంబంధించిన విషయంలో ఇద్దరి విద్యార్థినుల మధ్య చోటు చేసుకుంది. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యార్థినులు ఒకరినొకరు దూషణలకు దిగారు. దీంతో ఎంబీఏ విద్యార్థిని..ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిపై చేయి చేసుకుంది. ఈ క్రమంలో హాస్టల్‌ అధికారులు జోక్యం చేసుకొని ఇరువురికి సర్దిచెప్పి, హాస్టల్‌కు పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement