అనంతపురం అర్బన్: అనంతను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో రాంభూపాల్‌తో పాటు జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడారు. వర్షాభావంతో జిల్లాలో 54 శాతానికి పైగా పంటలు సాగు చేయలేదని, వేసిన పంటలు ఎండిపోయాయన్నారు. భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు రాకపోవడంతో పంట తోటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏదో ఒక చోట రైతు ఆత్మహ్యతలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని దుమ్మెత్తిపోశారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు, పంట నష్ట పరిహారం, కౌలు వెనక్కి చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లతో ఈనెల 23 నుంచి 27 వరకు జిల్లాలో జీపుజాతా నిర్వహించిన 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా తలపెట్టామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, సభ్యులు ఆర్‌వీనాయుడు, మారుతి, నిర్మల, భాస్కర్, నాగరాజు, అచ్చుత్ ప్రసాద్, మల్లికార్జున, నాగమణి, ముత్తుజ పాల్గొన్నారు.


