అనంతపురం క్రైం: ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు, సిబ్బంది సంఖ్యను పెంచాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అనంతపురం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్‌కు మంగళవారం వినతిపత్రం అందజేసింది. ఐద్వా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం పాత, స్క్రాప్ బస్సుల స్థానంలో కొత్త బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న ప్రచారం జరుగుతోందని, దీంతో అనేక ప్రాంతాల్లో బస్‌స్టాప్‌లను తగ్గించడం, నిర్ణీత స్టాపుల్లో బస్సులు నిలపకపోవడం, మహిళా ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా వ్యవహరించడం తదితర సమస్యలు కొనసాగుతున్నాయని ఐద్వా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుయమలీ, కార్యదర్శి అశ్విని, గీత, ఆర్. జోష్ తదితరులు పాల్గొన్నారు.


