●మద్యం చిచ్చు.. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

●మద్యం చిచ్చు.. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: మద్యం మహమ్మారి కుటుంబంలో చిచ్చుపెట్టింది. పని మాని.. తాగుడుకు బానిసైన భర్త డబ్బుకోసం హింసిస్తుండటంతో భరించలేకపోయిన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన ఆశాకు బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన ఎర్రిస్వామితో పదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. కొన్నేళ్లుగా ఎర్రిస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కూలి పనికి వెళ్లి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లడం.. మద్యం తాగి ఇంటికి రావడం పరిపాటిగా మారింది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగొచ్చిన ఎర్రిస్వామి భార్యతో గొడవపడి, అనంతరం బయటకు వెళ్లాడు. భర్త తీరుతో విసిగిపోయిన ఆశా జీవితంపై విరక్తిచెందింది. కొంతసేపటి తర్వాత ఆరు, నాలుగు, రెండు సంవత్సరాల వయసున్న కుమార్తెలు శ్రావ్య, రష్మిక, ఆద్యాలకు పురుగుమందు తాగించి.. ఆపై తాను కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు గమనించి వారిని హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులపై వేటు

అనంతపురం టౌన్‌: అసైన్డు భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ విజయలక్ష్మి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి మండలం వీరాపురంలో సర్వే నంబర్లు 683–ఏ, 683–బీ1, 683–బీ2లోని 6.75 ఎకరాల విస్తీర్ణం కలిగి 2023–24 మధ్యన నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములకు అప్పటి తాడిపత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ బసవరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ మంజునాథ్‌ యాదవ్‌ రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంంతో విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులపై డీఐజీ చర్యలకు తీసుకున్నారు.

ఎస్కేయూలో పీజీ అడ్మిషన్లు

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్‌ కళాశాలలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆసక్తి గల వారు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, ఎంఏ ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎంకాం, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌), బీకాం (ఆనర్స్‌), బీబీఏ కోర్సుపూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి, ఈ నెల 25 నుంచి 30వ తేదీలోపు యూనివర్సిటీలోని అడ్మిషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

నులిపురుగుల్ని నిర్మూలిద్దాం

అనంతపురం అర్బన్‌: పిల్లలకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సూచించారు. పిల్లలను ఇబ్బంది పెట్టే నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలన్నారు. ఈ నెల 25న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఈఓ అయూబ్‌ఖాన్‌, ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్‌, ఐడీసీఎస్‌ పీడీ సాజిదాబేగం, ఆర్‌బీఎస్‌ ప్రోగ్రాం అధికారి విష్ణుమూర్తి, మేనేజర్‌ రజిత, డీవీఈఓ గురవయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement